Balakrishna: లోకేశ్ ను పాదయాత్రలో అప్పుడప్పుడు కలుస్తుంటా: బాలకృష్ణ

  • సరస్వతి విద్యామందిర్ లో కార్యక్రమం
  • కంప్యూటర్లు పంపిణీ చేసిన బాలకృష్ణ
  • ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే లోకేశ్ పాదయాత్ర 
  • లోకేశ్ పాదయాత్ర చూసి ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యలు
Balakrishna says he will often visits Nara Lokesh while Yuvagalam Padayatra

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రేపు (జనవరి 27) కుప్పంలో పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. 

లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తుండడంతో ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. అందుకే లోకేశ్ పాదయాత్రకు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నారని తెలిపారు. తన అల్లుడు లోకేశ్ ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, యువతకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకే యువగళం చేపడుతున్నాడని బాలకృష్ణ స్పష్టం చేశారు. రేపటి పాదయాత్రలో లోకేశ్ తో పాటు తాను కూడా పాల్గొంటున్నట్టు వెల్లడించారు. మధ్యలో అప్పుడప్పుడు వెళ్లి లోకేశ్ ను కలుస్తుంటానని వివరించారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి చంద్రబాబు పాలన అవసరమని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్, ఒక చంద్రబాబు కావాలని పిలుపునిచ్చారు. 

ఇవాళ హిందూపురంలోని సరస్వతి విద్యామందిర్ లో వసంత పంచమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. అటు, అంబికా లక్ష్మీనారాయణ కుమార్తె వివాహానికి బాలయ్య కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ పెళ్లికి నందమూరి తారకరత్న కూడా వచ్చారు.

More Telugu News