పొత్తులపై పవన్ చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తోంది: సజ్జల రామకృష్ణారెడ్డి

  • షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడమనే నాలుగో ఆప్షన్ చెప్పాల్సిందని సజ్జల ఎద్దేవా 
  • గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి స్క్రిప్ట్ చదివి వెళ్తారని విమర్శ
  • పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్య
  • లోకేశ్, పవన్, చంద్రబాబులలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్
sajjala ramakrishna reddy satirical comments on pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని విమర్శించారు. పొత్తుల గురించి పవన్ చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తోందని, షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చెయ్యడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సిందంటూ ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

అసలు లోకేశ్, పవన్, చంద్రబాబులలో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. వైసీపీ అంటే జగన్.. జగన్ అంటే వైసీపీ అని తాము స్పష్టంగా ఉన్నామని... మరి వాళ్లు స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. విడివిడిగా వచ్చినా.. కలిసి వచ్చినా తమకు ఓకే అని సజ్జల సవాల్ చేశారు.

లోకేశ్ పాదయాత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంటోందని విమర్శించారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయని, గతంలో జగన్ ఆంక్షలకు లోబడే పాదయాత్ర చేశారని, ఆంక్షలు పెట్టారని గగ్గోలు పెట్టలేదని చెప్పుకొచ్చారు. కందుకూరు ఘటన నేపథ్యంలోనే రోడ్లపై సభల విషయంలో నిషేధం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం చేశామని ఏ ఆధారాలతో పవన్ కల్యాణ్ అంటున్నారని సజ్జల ప్రశ్నించారు. తాము సబ్‌ప్లాన్ కంటే ఎక్కువగానే నిధులు అందిస్తున్నామన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశారని... జగన్ మూడేళ్లలో రూ. 48 వేల కోట్లు నిధులు ఇచ్చారని చెప్పారు. పొలిటికల్‌గా, పదవుల పరంగా ఎస్సీ, ఎస్టీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సకల శాఖల మంత్రి అని పవన్ తనపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. టార్గెట్‌గా చేసుకుని ప్రజల్లో ఏదో క్రియేట్ చెయ్యడానికి ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News