తిరుమలలో కాలవ శ్రీనివాసులు కుమారుడి పెళ్లికి హాజరైన నారా లోకేశ్

  • తిరుమల నుంచి కుప్పం పయనమైన లోకేశ్ 
  • రేపు యువగళం పాదయాత్ర ప్రారంభం
  • కుప్పంలో ముమ్మరంగా ఏర్పాట్లు
  • కుప్పంలో భారీ బహిరంగ సభ
  • హాజరవుతున్న అచ్చెన్నాయుడు, బాలకృష్ణ
Nara Lokesh attends Kalava Srinivasulu son marriage in Tirumala

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు కుమారుడి పెళ్లికి హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నేత కాలవ శ్రీనివాసులు కుమారుడు భరత్ వివాహం నేడు తిరుమల పుణ్యక్షేత్రంలో జరిగింది. ఈ వివాహానికి హాజరైన లోకేశ్ వధూరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన తిరుమల నుంచి కుప్పం బయల్దేరారు. 

కాగా, లోకేశ్ చేపడుతున్న యువగళం పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర కొనసాగే ఈ సుదీర్ఘ పాదయాత్రకు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నారు. జనవరి 27న ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. 

పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లను టీడీపీ అగ్రనేతలు కళా వెంకట్రావు, నిమ్మల రామానాయుడు తదితరులు పర్యవేక్షిస్తున్నారు. 

ఈ బహిరంగ సభకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. యువగళం యాత్రకు సంఘీభావంగా కుప్పంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

More Telugu News