Trump: ఫేస్ బుక్ లోకి ట్రంప్ రీ ఎంట్రీ.. రెండేళ్ల తర్వాత ఖాతాను పునరుద్ధరించిన మెటా

  • ఆందోళనలకు మద్దతుగా మాట్లాడడంతో ట్రంప్ ఖాతాపై నిషేధం
  • మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ట్రంప్
  • నిధుల సమీకరణ మాజీ అధ్యక్షుడికి ఇప్పుడు మరింత సులభం
Donald Trump is back on Facebook and Instagram after 2 year ban

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాలను పునరుద్ధరించినట్లు వాటి మాతృసంస్థ మెటా ప్రకటించింది. ఈమేరకు బుధవారం తన బ్లాగ్ లో ఓ పోస్ట్ పెట్టింది. రెండేళ్ల నిషేధం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడి ఖాతాను యాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది. భవిష్యత్తులో వివాదాస్పద పోస్టులు పెడితే మళ్లీ నిషేధం తప్పదని స్పష్టం చేసింది. 

రెండేళ్ల క్రితం అమెరికా అధ్యక్ష భవనంతో పాటు వాషింగ్టన్ డీసీ లోని పలు ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగిన విషయం తెలిసిందే! ప్రెసిడెంట్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ దాడులకు పాల్పడిన వారికి మద్దతుగా డొనాల్డ్ ట్రంప్ పోస్టులు పెట్టడంతో ఆయనపై మెటా కంపెనీ చర్యలు తీసుకుంది. ట్రంప్ కు చెందిన ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలను రెండేళ్ల పాటు సస్పెండ్ చేసింది. తాజాగా ఈ గడువు పూర్తవడంతో ట్రంప్ ఖాతాలను పునరుద్ధరించింది. ట్విట్టర్ కూడా ట్రంప్ పై నిషేధం విధించగా.. ఆ కంపెనీ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చాక నిషేధం ఎత్తివేసింది.

అధ్యక్ష ఎన్నికల ఖర్చుల కోసం నిధుల సమీకరణకు గతంలో ట్రంప్ ఫేస్ బుక్ పైనే ఎక్కువగా ఆధారపడ్డారు. పెద్ద మొత్తంలో నిధులు కూడా ఫేస్ బుక్ ద్వారానే సమీకరించారు. 2016 నుంచి 2020 మధ్య కాలంలో మిలియన్ల కొద్దీ డాలర్లను ఫేస్ బుక్ ప్రకటనల ద్వారా ట్రంప్ పోగేశారు. ఫేస్ బుక్ లోని 34 మిలియన్ల ఫాలోవర్లతో ట్రంప్ నేరుగా (లైవ్) మాట్లాడే అవకాశం ఉంది. రాబోయే ప్రెసిడెంట్ ఎన్నికల్లో మూడోసారి పోటీపడాలని నిర్ణయించుకున్న ట్రంప్ కు మెటా నిర్ణయం ఉపశమనమేనని రాజకీయ వర్గాల అభిప్రాయం. 

ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లు తనపై నిషేధం విధించడంతో డొనాల్డ్ ట్రంప్ తనే సొంతంగా ఓ సోషల్ మీడియా యాప్ ను తయారుచేసుకున్నారు. ట్రూత్ సోషల్ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా తన అభిమానులు, మద్దతుదారులతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. ట్విట్టర్ లో తనపై నిషేధాన్ని మస్క్ తొలగించి చాలా రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ట్రంప్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.

More Telugu News