దయచేసి ఆ అనుబంధాన్ని చెడగొట్టొద్దు.. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు మనవళ్లు

26-01-2023 Thu 06:40 | Entertainment
  • ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ వ్యాఖ్యల వివాదం
  • వీడియో విడుదల చేసిన ఎస్వీ రంగారావు మనవళ్లు
  • బాలకృష్ణ వ్యాఖ్యల్లో వివాదం కనిపించలేదని స్పష్టీకరణ
  • ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని స్పష్టీకరణ
SV Ranga Rao Grand Sons Responds About Balakrishna Comments
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వీరసింహారెడ్డి’ విజయోత్సవ సభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు మనవళ్లు స్పందించారు. ఈ సభలో అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావును బాలకృష్ణ అవమనించారంటూ వస్తున్న వార్తలపై వారు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో వారు మాట్లాడుతూ.. బాలకృష్ణ మాటల్లో తమకు ఎలాంటి వివాదమూ కనిపించలేదన్నారు. బాలకృష్ణతో తమకు మంచి సంబంధం ఉందని, కాబట్టి ఈ వివాదాన్ని ఇంకా సాగదీసి తమ మధ్య ఉన్న అనుబంధాన్ని పాడు చేయొద్దని కోరారు. 

వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయని అన్నారు. బాలకృష్ణ గారితో తమకు మంచి అనుబంధం ఉందని, తాము ఒకే కుటుంబంలా ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన సాధారణ పోకడలో చెప్పారని అన్నారు. ఈ విషయంలో తమకు ఎలాంటి వివాదం కనిపించడం లేదని, మీడియాలో ఈ విషయాన్ని ఇంకా సాగదీసి, వివాదాన్ని తీసుకొచ్చి తమకు, ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టొద్దని ఎస్వీ రంగారావు మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు (నటుడు), ఎస్‌వీఎల్ఎస్ రంగారావు (బాబాజీ) విజ్ఞప్తి చేశారు.