రోజుకు 8 నిమిషాల పనికి ఏడాదికి రూ. 40 లక్షల జీతం ఇస్తున్నారు: ఐఏఎస్ అధికారి ఖేమ్కా

25-01-2023 Wed 17:12 | National
  • ఇప్పటి వరకు 56 సార్లు బదిలీ అయిన అశోక్ ఖేమ్కా
  • ప్రస్తుతం హర్యానా ఆర్కైవ్స్ శాఖలో ఉద్యోగం
  • తనకు వారానికి గంటకు మించి పని లేదని ఆవేదన
IAS officer Khemka comments on less work hours
మన దేశ ఐఏఎస్ అధికారుల్లో అశోక్ ఖేమ్కాది ఒక ప్రత్యేకమైన స్థానం. దేశంలో ఎక్కువసార్లు బదిలీ అయిన అధికారిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆయనను హర్యానా రాష్ట్ర ఆర్కైవ్స్ శాఖకు బదిలీ చేశారు. ఇది ఆయనకు 56వ బదిలీ. తాజాగా ఆయన స్పందిస్తూ... తన విభాగం వార్షిక బడ్జెట్ రూ. 4 కోట్లు అని... ఇది రాష్ట్ర బడ్జెట్ లో 0.0025 శాతం కంటే తక్కువ అని అన్నారు. అదనపు ప్రధాన కార్యదర్శిగా తనకు సంవత్సరానికి అందుతున్న జీతం రూ. 40 లక్షలు అని... ఇది ఆర్కైవ్స్ విభాగం బడ్జెట్ లో 10 శాతమని చెప్పారు. 

ఇక తన డిపార్ట్ మెంట్ లో తనకు వారానికి గంటకు మించి పని లేదని అన్నారు. మరోవైపు కొందరు అధికారులకు తలకు మించిన పని ఉందని చెప్పారు. కొందరికి పని లేకపోవడం.. మరికొందరికి విపరీతంగా పని ఉండటం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరవని అన్నారు. అవినీతి క్యాన్సర్ ను వదిలించాలనే తాను తన కెరీర్ ను పణంగా పెట్టానని... ఈ విషయంలో విజిలెన్స్ విభాగం ముఖ్యమయినదని... కెరీర్ చివర్లో ఉన్న తాను ఈ విభాగంలో సేవలను అందించాలనుకుంటున్నానని చెప్పారు. తనకు అవకాశమిస్తే... అతినీతిపై నిజమైన యుద్ధం చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.