Kangana Ranaut: చిత్ర పరిశ్రమ లాభాలు పిండుకునేందుకు కాదు..: కంగనా రనౌత్

  • బిలియన్, ట్రిలియన్ డాలర్లు ఆర్జించేందుకు సినిమా రూపొందించలేదన్న కంగన 
  • కళ, సంస్కృతులకు సినిమా వేదిక అని గుర్తు చేసిన నటి
  • అందుకే కళాకారులను ఆదరిస్తారే కానీ బిలియనీర్లను కాదని వ్యాఖ్య 
Kangana Ranaut calls film industry crass day after return to Twitter slams obsession with box office figures

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తిరిగి ట్విట్టర్ లోకి అడుగు పెట్టేసింది. వివాదాస్పద ట్వీట్లతో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆమెపై గతంలో ట్విట్టర్ వేటు వేసింది. ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత అలాంటి ఖాతాలను పునరుద్ధరించడంతో కంగన ఖాతా కూడా తెరుచుకుంది. చిత్ర పరిశ్రమ ధోరణిని ఆమె తన తాజా ట్వీట్ల ద్వారా తప్పు బట్టారు. ఇక్కడ ఒక సినిమా ఎంత విజయం సాధించిందన్నది అది వసూలు చేసుకునే కలెక్షన్ల ఆధారంగా చూస్తారని వాపోయింది. షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో బుధవారం బాక్సాఫీసు జర్నీ మొదలు పెట్టగా.. సరిగ్గా ఇదే సమయంలో కంగన ట్వీట్ చేయడం గమనార్హం. 

ప్రాజెక్ట్ విజయం కోసం సినిమా పరిశ్రమ ఎంతో క్రూరంగా వ్యవహరిస్తుందని ఆమె వ్యాఖ్యానించింది. సినిమా అన్నది భారీ లాభాలు పొందేందుకు తీసేది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘‘ప్రాథమికంగా కళ అనేది ఆలయాల్లో భాసిల్లుతుంది. సాహిత్యం, థియేటర్, చివరిగా సినిమాల్లోకి చేరుతుంది. ఇదొక పరిశ్రమ. కానీ బిలియన్, ట్రిలియన్ డాలర్లు ఆర్జించేందుకు డిజైన్ చేయబడింది కాదు. అందుకే కళని, కళాకారులను ఆదరిస్తారే కానీ, పారిశ్రామికవేత్తలు, బిలియనీర్లను కాదు’’ అంటూ నేడు చిత్ర పరిశ్రమ ఏ విలువలతో పనిచేయాలో కంగన రనౌత్ స్పష్టంగా చెప్పేశారు. 

ఒకవేళ కళాకారులు కళ, సంస్కృతిని కలుషితం చేసే పనిలో పాల్గొంటున్నట్టు అయితే వారు దాన్ని సిగ్గు విడిచి కాకుండా విచక్షణతో చేయాలని కంగన సూచించింది. రెండేళ్ల నిషేధం తర్వాత మంగళవారం నుంచి కంగన ట్విట్టర్ ఖాతా తిరిగి పనిచేయడం ప్రారంభించింది. ఇన్ స్టా గ్రామ్ వేదిక చెత్త అని, తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ట్విట్టర్ చక్కని వేదిక అని ఆమె లోగడ చెప్పడం తెలిసిందే.

More Telugu News