Tirupati: వింత వాసన వస్తోందని గ్రామస్థుల ఫిర్యాదు.. బయటపడ్డ పెరట్లోని గంజాయి మొక్కల సాగు!

Tirupati District man grows ganja near his house at mannegunta
  • తిరుపతి జిల్లా మన్నెగుంట గ్రామంలో ఘటన
  • పెరట్లో మిగతా మొక్కలతో కలిపి పెంచుతున్న యజమాని
  • వీధి వీధంతా వింత వాసన.. 
  • పోలీసులకు సమాచారమిచ్చిన గ్రామస్థులు
ఇంటి వెనకున్న పెరట్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలు పెంచుతున్న యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. మొక్కలు పెంచేందుకు సాయం చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం మన్నెగుంట గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన.

గ్రామానికి చెందిన వెంకయ్య అనే వ్యక్తి, స్నేహితుడు ప్రతాప్ సాయంతో తన పెరట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. పెరట్లోని మిగతా మొక్కల మధ్య ఉండడంతో ఎవరికీ తెలియదని అనుకున్నాడు. అయితే, మొక్క కాస్త పెరిగాక వెంకయ్య ఇంటి నుంచి వింత వాసన రావడం మొదలైంది. రోజుల తరబడి వాసన అలాగే వస్తుండడంతో గ్రామస్థులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి వెంకయ్య ఇంట్లో సోదాలు చేయగా.. పెరట్లో పెంచుతున్న నాలుగు గంజాయి మొక్కల సంగతి బయటపడింది.

గంజాయి మొక్కలు సుమారు ఏడు అడుగుల వరకు పెరిగాయని, గంజాయి దాదాపు 2 కేజీల బరువు ఉంటుందని పోలీసులు చెప్పారు. గంజాయి మొక్కలను పెంచినా, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.
Tirupati
ganja
police
village
ganja plant in home
Andhra Pradesh
smell

More Telugu News