వైసీపీ మహిళా నేత నుంచి రూ.44 లక్షల దొంగనోట్ల స్వాధీనం

25-01-2023 Wed 12:34 | Andhra
  • రసపుత్ర రజినిని అరెస్టు చేసిన బెంగళూరు పోలీసులు
  • బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా ఇటీవలే పూర్తయిన పదవీకాలం
  • రజనికి మరోసారి అదే పదవిని ఇచ్చిన సర్కారు
  • పోలీసుల అదుపులో మరో నిందితుడు చరణ్ సింగ్ కూడా
YCP Leader And Bondili Corporation Director Rasaputra Rajini Arrested In Fake Currency Case
నకిలీ నోట్ల చలామణి కేసులో వైసీపీ మహిళా నేత రసపుత్ర రజినిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుంచి రూ.44 లక్షల విలువైన రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ గా వ్యవహరించిన రజిని పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. దీంతో మరోసారి రజినికి అదే పదవిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజిని.. అధికార పార్టీ వైసీపీలో యాక్టివ్ గా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆమె నుంచి రూ.44 లక్షల విలువైన నకిలీ 500 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

అనంతపురం పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి నకిలీ నోట్లు కొనుగోలు చేసి రజిని బెంగళూరులో వాటిని సర్క్యులేట్ చేస్తున్నట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, దొంగనోట్ల వ్యవహారంతో తనకేం సంబంధంలేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో రజిని పాత్ర ఉందని తేలితే పార్టీ పరంగా ఆమెపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.