వెంకటేశ్ 75వ సినిమాగా 'సైంధవ్' .. ఫస్టు గ్లింప్స్ రిలీజ్!

25-01-2023 Wed 11:18 | Entertainment
  • హీరోగా 1986లో మొదలైన వెంకీ ప్రయాణం
  • వరుసగా ఆయన ఖాతాలో చేరిన భారీ విజయాలు  
  • ఆయన 75వ సినిమా కోసం మొదలైన సన్నాహాలు
  •  టైటిల్ గా 'సైంధవ్' ఖరారు 
  • శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది
Venkatesh 75th movie glimpse released
బలమైన సినిమా నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, వెంకటేశ్ తనని తాను మలచుకుంటూ స్టార్ గా ఎదిగారు. 1986 నుంచి మొదలైన ఆయన ప్రయాణంలో ఎన్నో హిట్లు కనిపిస్తాయి. మరెన్నో సినిమాలు కొత్త రికార్డులను నమోదు చేశాయి. అలాంటి వెంకటేశ్ క్రితం ఏడాది 'ఎఫ్ 3' సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు. అలాగే 'ఓరి దేవుడా' సినిమాలో ప్రత్యేకమైన పాత్రలోను అలరించారు.

ఆ తరువాత ఆయన చేయనున్నది తన కెరియర్లో 75వ సినిమా. ఏ డైరెక్టర్ తో ఆయన ఈ సినిమా చేయనున్నాడా అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే 'హిట్ 2'తో హిట్ కొట్టిన శైలేశ్ కొలను దర్శకత్వంలో ఆయన ఈ సినిమా చేయనున్నారనే విషయం అధికారికంగా బయటికి వచ్చింది.

వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. 'సైంధవ్' అనే టైటిల్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. వెంకీ రఫ్ లుక్ .. ఆయన గన్ పట్టుకున్న తీరు చూస్తుంటేనే, ఇది భారీ యాక్షన్ మూవీ అనే విషయం అర్థమవుతోంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.