Pawan Kalyan: తెలంగాణలో 7 నుంచి 14 చోట్ల పోటీ చేద్దాం: నేతలతో పవన్ కల్యాణ్

  • వారాహి వాహనానికి కొండగట్టులో పూజలు
  • నాచుపల్లిలో జనసేన తెలంగాణ నేతలతో పవన్ సమావేశం
  • తెలంగాణలో పరిమిత రాజకీయాలు చేస్తామని వెల్లడి
  • కనీసం 10 మంది జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలని ఆకాంక్ష
Pawan Kalyan held meeting with Janasena Telangana leaders

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టు అంజన్న క్షేత్రంలో తన వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన అనంతరం జగిత్యాల జిల్లా నాచుపల్లిలో జనసేన తెలంగాణ కార్యకవర్గంతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే స్థాయిలో తాను లేనని, తెలంగాణ ప్రజల నుంచి నేర్చుకునే స్థాయిలో ఉన్నానని తెలిపారు. తెలంగాణ ప్రజల పోరాటాల నుంచి తాను స్ఫూర్తి పొందుతానని వివరించారు. తాను ఏపీలో చెప్పుతో కొడతానని అన్న మాటల వెనుక స్ఫూర్తి కలిగించింది తెలంగాణ గడ్డ అని పవన్ వెల్లడించారు. గతంలో బట్టలూడదీసి కొడతా అన్నది కూడా తెలంగాణ గడ్డపైనే అని తెలిపారు. 

"ఈ నేల పెట్టిన తిండి తిన్నాను... అది ఎక్కడికి పోతుంది... రక్తంలో ఇంకిపోయింది. నాదొక్కటే కోరిక... కనీసం పది మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యేలు ఉండాలి" అని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఏదైనా సమస్యపై గొంతెత్తిన తర్వాత కూడా పరిష్కారం రాకపోతే వీధిపోరాటాలకు సిద్ధం కావాలని, అలాంటి వీధిపోరాటాలకు తాను సిద్ధమేనని అన్నారు. ఎందుకు వచ్చారని తెలంగాణ ప్రజలు అడిగితే, మేం మీ భుజం కాయడానికి వచ్చామని చెప్పాలని పార్టీ నేతలకు పవన్ పిలుపునిచ్చారు. 

అయితే, తెలంగాణలో తాము పరిమితస్థాయిలోనే పోటీ చేస్తామని వెల్లడించారు. 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేసినా, బలంగా పోటీ చేద్దామని అన్నారు. నేతలు ఎక్కడ పోటీ చేద్దామంటే అక్కడ పోటీ చేద్దాం... నేను ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా అని పవన్ పేర్కొన్నారు. తెలంగాణలో తమతో ఎవరైనా పొత్తుకు వస్తే స్వాగతిస్తామని తెలిపారు. మంచి భావజాలం ఉన్న పార్టీలతోనే జనసేన పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. 

ఒక చిన్న ఉద్యోగానికే ఎన్నో టెస్టులు పెడతారని, నాయకత్వం వహించాలంటే ఇంకెన్ని పరీక్షలు ఎదుర్కోవాలి? కాలం పెట్టే పరీక్షలు ఎదుర్కోవడానికి నేను రెడీ అని పేర్కొన్నారు. చాలా విషయాల్లో తాను తగ్గి మాట్లాడుతున్నానని... భయపడి మాత్రం కాదని పవన్ వెల్లడించారు. తెలంగాణలో పరిమితులతో కూడిన ఆట ఆడుతున్నానని అన్నారు. 

ఏపీతో పోల్చితే తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని, ఏపీ తరహా నాయకత్వం తెలంగాణలో ఉండుంటే ఇంత అభివృద్ధి చెందేది కాదని అభిప్రాయపడ్డారు. బాబాయ్ ని చంపేవాళ్లు, న్యాయవ్యవస్థలను తిట్టేవాళ్లు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేవాళ్లు ఏపీలో ఉన్నారని పవన్ కల్యాణ్ పరోక్ష విమర్శలు చేశారు. ఏపీలో కులాల గీతల మధ్యన రాజకీయం చేయాల్సి ఉంటుందని, తనలాంటి వాడికి అది చాలా కష్టమైన పని అని వివరించారు.

More Telugu News