BJP: ముస్లిం వ్యతిరేక ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ వ్యూహాలు

BJPs outreach to Muslims aimed at countering communitys push against party
  • దేశవ్యాప్తంగా ముస్లింలకు చేరువయ్యేందుకు కార్యక్రమం
  • బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ప్రణాళిక
  • కేంద్ర పథకాలతో ముస్లింలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో వివరించే ప్రయత్నం
తనపై వున్న హిందుత్వ ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించింది. మైనారిటీలను, ముఖ్యంగా ముస్లింలకు చేరువ కావడం ద్వారా ఈ మత ముద్రను తొలగించుకునే వ్యూహాలు అమలు చేయనుంది. 

సామాజిక సంక్షేమ పథకాల్లో ముస్లింల ప్రాతినిధ్యాన్ని ప్రధానంగా ప్రస్తావించాలంటూ కేడర్ కు బీజేపీ అధిష్ఠానం సూచించింది. తద్వారా మత ప్రాతిపదికన వారి పట్ల ఎటువంటి వివక్ష లేదన్నది ఎత్తి చూపించాలనే ఆదేశాలు క్షేత్రస్థాయి వరకు వెళ్లాయి. బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, ముస్లింలు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాన లబ్ధిదారులుగా ఉండడం ఆయా ఆరోపణలకు చెక్ పెడుతుందని బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు. 

‘‘బ్యాలట్ రూపంలో మైనారిటీలు మద్దతుగా నిలవకపోయినా సరే, వారిని ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోకూడదని బీజేపీ కోరుకుంటోంది. వారు కోరుకున్న పార్టీకి ఓటు వేసుకోవచ్చు. కానీ, ఎవరికి ఓటు వేయాలనే వారి నిర్ణయాన్ని బీజేపీ పట్ల ద్వేష భావన కారణం కాకూడదు’’ అని సదరు బీజేపీ నేత వివరించారు. 

ఆర్థికంగా, సామాజికంగా ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు చేరువ కావాలంటూ బీజేపీ కేడర్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాల సందర్భంగా పిలుపునివ్వడం గమనార్హం. ముస్లింలలోనూ వెనుకబడిన వర్గాలు ఎన్నో ఉన్నాయి. వీరిని పస్మందాగా పిలుస్తారు. ఎలక్టోరల్ పాలిటిక్స్ కోణంలో కాకుండా, ఆయా వర్గాలకు సన్నిహితం కావాలని ప్రధాని కోరారు. బోహ్రా ముస్లింలు బీజేపీకి వ్యతిరేకం కారన్న ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.

ఫిబ్రవరి 10 నుంచి బీజేపీ మైనారిటీ మోర్చా విభాగం దేశవ్యాప్తంగా 60 లోక్ సభ స్థానాల పరిధిలో 5,000 మందిని గుర్తించనుంది. వీరి సాయంతో మైనారిటీ వర్గాలకు బీజేపీ చేరువ అయ్యే ప్రయత్నాలు చేయనుంది. ముస్లిం జనాభా 30 శాతం కంటే ఎక్కువ ఉన్న 30 నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నట్టు సదరు బీజేపీ నేత వెల్లడించారు. 

‘‘కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఆవాస్ యోజన, హర్ ఘర్ నాల్, స్కాలర్ షిప్ లు, ఆయుష్మాన్ భారత్ పథకాల్లో ఎంత మంది ముస్లింలు లబ్ధిదారులుగా ఉన్నారనే వాస్తవాలను ముస్లింలకు వివరించనున్నాం’’ అని బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమల్ సిద్దిఖి తెలిపారు. ముందుగా బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, హర్యానా, జమ్మూ కశ్మీర్ లలో ఈ కార్యక్రమాలను బీజేపీ మైనారిటీ మోర్చా చేపట్టనుంది. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు విస్తరించనుంది.
BJP
outreach
Muslims
PM Narendra Modi
BJP minority morcha

More Telugu News