కోట్లలో ఆస్తులున్నాయి .. కానీ సంతోషమే లేదు: నటి పీఆర్ వరలక్ష్మి

24-01-2023 Tue 11:39 | Entertainment
  • తాజా ఇంటర్వ్యూలో పీఆర్ వరలక్ష్మి 
  • ఆ తరం హీరోల క్రమశిక్షణ గురించిన ప్రస్తావన 
  • అందుకే చెన్నైని వదిలిపెట్టలేదని వ్యాఖ్య 
  • బాలు మరణం బాధించిందని వెల్లడి
PR Varalakshmi Interview
నిన్నటితరం సీనియర్ కేరక్టర్ ఆర్టిస్టులలో పీఆర్ వరలక్ష్మి ఒకరు. మధ్యతరగతి గృహిణి పాత్రలలో ఆమె నటన అప్పట్లో అందరినీ ఆకట్టుకునేది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఆమె నటించారు. తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్లినా, నేను చెన్నైలోనే ఉండిపోయాను. అందుకు కారణం నా బంధువులు .. ఆస్తులు ఇక్కడ ఉండటమే" అన్నారు. 

ఎన్టీ రామరావు .. ఎంజీఆర్ .. శివాజీ గణేశన్ వంటివారి సినిమాల్లోను నటించాను. వాళ్ల సమయపాలన చూసి నాకు ఆశ్చర్యమేసేది. నాకు ఇద్దరు ఆడపిల్లలు .. ఇద్దరూ ఇంజనీర్లే .. వాళ్ల భర్తలు కూడా ఇంజనీర్లే. సినిమాల వైపు ఎవరినీ రానీయలేదు .. ఎందుకంటే వేషాలు లేని రోజున ఏం చేస్తారు? నేను సంపాదించిన దాంట్లో దాచుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏమిటి? అని అన్నారు. 

కోట్లలో ఆస్తులున్నాయి .. అలాగని వందల కోట్లలో కాదు. నేను సంపాదించినదానిలో చాలామందికి చాలా సహాయాలు చేశాను. అన్నీ ఉన్నాయి .. కాకపోతే ఏ రోజు .. ఏ వ్యాధి ఎటువైపు నుంచి వస్తుందనేది తెలియకుండా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు  .. కైకాల గారి కాంబినేషన్లో ఎన్నో సినిమాల్లో చేశాను. వారు చనిపోవడం నన్ను ఎక్కువగా బాధపెట్టింది" అంటూ చెప్పుకొచ్చారు.