Rajasthan: ఉద్యోగం పోతుందనే భయంతో.. పసికందును కెనాల్ లో పడేసిన తండ్రి! రాజస్థాన్ లోని బికనీర్ లో దారుణం

  • ముగ్గురు పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హత
  • మూడో బిడ్డకు జన్మనిచ్చిన ప్రభుత్వ ఉద్యోగి కంపల్సరీ రిటైర్మెంట్
  • నిబంధనను కఠినంగా అమలు చేస్తున్న రాజస్థాన్ ప్రభుత్వం
Rajasthan man throws 5 month old daughter into canal fearing losing job

రాజస్థాన్ లోని బికనీర్ లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం పోతుందనే భయంతో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి తన మూడో బిడ్డ, నెలల పసికందును కాలువలో విసిరేశాడు. భార్యతో కలిసి ఈ ఘోరానికి తెగబడ్డాడు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. విషయం తెలియడంతో పోలీసులు ఆ భార్యాభర్తలు ఇద్దరినీ సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

బికనీర్ కు చెందిన జవార్ లాల్ మేఘ్వాల్ ఓ కాంట్రాక్టు ఉద్యోగి. రేపో మాపో తనలాంటి ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ చేస్తుందని ఎదురుచూస్తున్నాడు. మేఘ్వాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే మేఘ్వాల్ భార్య మూడో బిడ్డ (ఆడపిల్ల) కు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ పాప వయసు ఐదు నెలలు. అయితే, ముగ్గురు పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతారని మేఘ్వాల్ కు ఇటీవలే తెలిసింది. అంతేకాదు, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు మూడో సంతానానికి జన్మనిస్తే.. ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ రూల్ ను కఠినంగా అమలు చేస్తోంది.

ఈ విషయం తెలిసిన తర్వాత మేఘ్వాల్ ఆందోళనకు లోనయ్యాడు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ఎప్పుడు పర్మనెంట్ అవుతుందా అని ఎదురుచూస్తుంటే.. ఉన్న ఉద్యోగమే ఊడేలా ఉందని భయపడ్డాడు. భార్యతో కలిసి చర్చించి, మూడో బిడ్డను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆపై పసికందును తీసుకుని వెళ్లి ఛత్తార్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కెనాల్ లో పారేసి వచ్చారు. నెలల పసికందు మరణానికి కారణమైన ఆ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ అరెస్టు చేసి విచారిస్తున్నారు.

More Telugu News