Mohammed Shami: టీమిండియా పేసర్ షమీకి షాక్.. భార్యకు ప్రతి నెల రూ. 50 వేల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశం

Kolkata court orders Shami to pay monthly alimony to estranged wife Hasin Jahan
  • భరణంగా నెలకు రూ. 10 లక్షలు చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరిన హసీన్ జహాన్
  • కోర్టు తీర్పుపై హసీన్ తీవ్ర అసంతృప్తి
  • కోల్‌కతా కోర్టు తీర్పును పైకోర్టులో సవాలు చేయనున్న హసీన్ జహాన్
టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి కోల్‌కతా కోర్టులో చుక్కెదురైంది. తన మాజీ భార్య హసీన్ జహాన్‌కు భరణం కింద ప్రతి నెల రూ. 50 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై హసీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత ఖర్చుల కోసం రూ. 7 లక్షలు, కుమార్తెను చూసుకునేందుకు రూ. 3 లక్షలు కలిపి మొత్తంగా నెలకు రూ. 10 లక్షలు ఇప్పించాలంటూ 2018లో హసీన్ కోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు మాత్రం నెలకు రూ. 50 వేలు మాత్రమే చెల్లించాలని షమీని ఆదేశించింది. అలీపూర్ కోర్టు న్యాయమూర్తి అనిందిత గంగూలీ ఇచ్చిన ఈ తీర్పును జహాన్ పైకోర్టులో సవాలు చేయనున్నట్టు సమాచారం.

జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో షమీపై హసీన్ జహాన్ గృహ హింస కేసు పెట్టడంతో వీరిమధ్య విభేదాలు ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నేపథ్యంలో షమీపై నాన్ బెయిలబుల్, హత్యాయత్నం వంటి అభియోగాలు నమోదయ్యాయి. తాను తన సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారీ తనను చిత్రహింసలకు గురిచేసేవారని హసీన్ ఆరోపించారు.

షమీ కుటుంబ సభ్యులు తనతో ఎలా ప్రవర్తించేవారో ఇరుగుపొరుగు వారిని అడిగినా తెలుస్తుందన్నారు. అతడు (షమీ) రెండేళ్లుగా విడాకుల కోసం అడుగుతున్నా తాను మౌనంగా ఉన్నానని, దీంతో తనను చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపించారు. తనను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు అవసరమైన అన్ని పనులు చేశారని హసీన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతేకాదు, వివిధ ఫోన్ నంబర్లతో షమీ తనకు ఫోన్ చేసి బెదిరించాడని కూడా జహాన్ పేర్కొన్నారు. అయితే, షమీ మాత్రం ప్రతిసారి ఆమె చేసిన ఆరోపణలను కొట్టిపడేశాడు. తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు జరుగుతున్న కుట్రలో ఇదంతా భాగమని పేర్కొన్నాడు. తనపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు షమీ పేర్కొన్నాడు.
Mohammed Shami
Kolkata Court
Hasin Jahan
Team India

More Telugu News