బీఎస్ఎన్ఎల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఐపీటీవీ సర్వీసుల ప్రారంభం

24-01-2023 Tue 07:33 | Andhra
  • సిటీ మీడియాతో కలిసి ఐపీటీవీ సేవలు ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్
  • ‘ఉల్కా టీవీ’ పేరుతో విజయవాడలో అందుబాటులోకి
  • త్వరలోనే ఏపీ సర్కిల్ వినియోగదారులకు..
  • టీవీ, బ్రాడ్‌బ్యాండ్ రెండింటికీ ఒకటే కనెక్షన్
  • వెయ్యికిపైగా టీవీ చానళ్లు వీక్షించే సదుపాయం
BSNL Launched ITPV Services In Vijayawada
మీరు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఖాతాదారులా? అయితే ఇది మీకు తప్పకుండా శుభవార్తే. ఇంటర్నెట్ ప్రొటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది. సిటీ మీడియాతో కలిసి ఉల్కా టీవీ పేరుతో విజయవాడలో ఇటీవల ఈ సర్వీసులను ప్రారంభించింది. త్వరలోనే ఏపీ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్ఎల్ ఖాతాదారులకు ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల ద్వారా వెయ్యికిపైగా టీవీ చానళ్లను వీక్షించే అవకాశం లభిస్తుంది.

టీవీకి వేరుగా, బ్రాడ్‌బ్యాండ్ కోసం వేరుగా రెండు వేర్వేరు కనెక్షన్లు కాకుండా ఒకే కనెక్షన్‌తో ఈ రెండింటిని ఒకేసారి అందించేందుకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త కస్టమర్లతోపాటు పాత వినియోగదారులు కూడా ఈ సర్వీసులు పొందొచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. అంతేకాదు, టీవీతోపాటు స్మార్ట్‌ఫోన్‌లోనూ ఈ సేవలను పొందొచ్చు.