రాజమౌళి గారూ, మీ భద్రతను పెంచుకోండి.. మిమ్మల్ని చంపడానికి సిద్ధమవుతున్న వారిలో నేనూ భాగమే: ఆర్జీవీ

24-01-2023 Tue 07:09 | Entertainment
  • ‘ఆర్ఆర్ఆర్’ టీం ఇటీవల షేర్ చేసిన వీడియోను రీ ట్వీట్ చేసిన వర్మ
  • ఓ భారతీయ దర్శకుడు ఇలాంటి క్షణాలను ఆస్వాదించి ఉండడని ప్రశంసలు
  • రాజమౌళిని చూసి కొందరు దర్శకులు స్వచ్ఛమైన అసూయతో రగిలిపోతున్నారని వ్యాఖ్య
  • తాను తాగి ఉన్నాను కాబట్టే ఈ విషయం బయటపెట్టేస్తున్నానంటూ సరదా ట్వీట్
RGV Retweets RRR Shared Video and Praised Rajamouli
సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర ట్వీట్లు చేస్తూ ఆకర్షించే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా అలాంటిదే మరో ట్వీట్ చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ ఇటీవల ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోను రీ ట్వీట్ చేసిన వర్మ.. ఓ భారతీయ సినీ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో దాదాసాహెబ్ ఫాల్కే నుంచి రాజమౌళి సహా ఇప్పటి వరకు ఎవరూ ఊహించి ఉండరని పేర్కొంటూ ప్రశంసలు కురిపించాడు.

అలాగే, మరో ట్వీట్‌లో రాజమౌళిని భద్రత పెంచుకోమని కోరాడు. దేశంలోని కొందరు దర్శకులు స్వచ్ఛమైన అసూయతో రగిలిపోతున్నారని, రాజమౌళిని అంతమొందించేందుకు రెడీ అవుతున్నారని, అందులో తానూ ఒకడినని సరదాగా బెదిరించారు. తానేదో తాగి ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని బయటపెట్టేస్తున్నానంటూ తన ట్వీట్ లో చమత్కరించారు. ఇప్పుడీ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.