లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలంటూ విజయవాడలో 108 జంటలతో 11 రకాల హోమాలు

23-01-2023 Mon 19:16 | Andhra
  • నేడు నారా లోకేశ్ పుట్టినరోజు
  • ఈ నెల 27న యువగళం పాదయాత్ర చేపట్టనున్న లోకేశ్
  • నేడు విజయవాడ పున్నమి ఘాట్ లో 108 జంటలతో హోమాలు
  • హాజరైన పలువురు టీడీపీ నేతలు
Special cults in Vijayawada seeking Lokesh Padayatra victorious
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని, నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడలోని పున్నమి ఘాట్లో టీడీపీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 జంటలతో 11 రకాల హోమాలు నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్. రాజు, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు పంతంగాని నరసింహ ప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. 

అనంతరం శాసనమండలి సభ్యుడు దువ్వారపు రామారావు, శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కె.ఎస్.జవహర్, పీతల సుజాత, పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, కైకలూరు ఇంఛార్జి జయమంగళం వెంకటరమణ, జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మద్దిపాటి వెంకట్రాజు, కేశినేని చిన్ని, తదితర టీడీపీ నేతలు, కార్యకర్తల ఆధ్వర్యంలో 1000 కిలోల భారీ కేక్ కట్ చేసి నారా లోకేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత శివపార్వతుల కల్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అటు, మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలోనూ లోకేశ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, నాగుల్ మీరా, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామ్ రాజు, పరుచూరి ప్రసాద్,  టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్, మీడియా కో ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు, టీడీపీ రాష్ట్రకార్యదర్శి  ఏవీ రమణ, ఎన్.ఆర్.ఐ విభాగం వేమూరి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా టీడీపీ నేతలు స్పందిస్తూ, ఆపితే ఆగడానికి లోకేశ్ ఆర్టీసీ బస్సు కాదని, బుల్లెట్ ట్రైన్ అని పేర్కొన్నారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.... జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ది శూన్యం అని వెల్లడించారు. ఏ ఒక్క వర్గం ప్రజలు సంతోషంగా లేరని, జగన్ రెడ్డిని నమ్మి నట్టేట మునిగామని ప్రజలంతా వాపోతున్నారని వివరించారు. వైసీపీ పాలనలో దగా పడిన రాష్ట్ర ప్రజలంతా నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. 

ప్రతి ఊరు, వాడ బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, దీన్ని గ్రహించే జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఓటమి భయంతో పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. యువగళానికి ప్రజా బలం ఉందని, జగన్ రెడ్డి కుట్రలను తిప్పి కొట్టి పాదయాత్రను ప్రజలే విజయవంతం చేస్తారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 1983 నాటి ప్రభంజనం ఖాయమని తెలిపారు.