G.O No1: జీవో నెం.1పై ఏపీ హైకోర్టులో విచారణ... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీజే!

  • ఇటీవల జీవో నెం.1 తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం
  • జీవో నెం.1 నేపథ్యంలో విపక్షాల ఆగ్రహం
  • హైకోర్టులో సీపీఐ రామకృష్ణ పిటిషన్
  • ఈ నెల 23 వరకు జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు
  • నేడు తదుపరి విచారణ షురూ
  • వెకేషన్ బెంచ్ ఒక డిఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించిందని సీజే వ్యాఖ్య 
CJ comments on GO No1 Case

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవో నెం.1పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల వెకేషన్ బెంచ్ ఇచ్చిన స్టే గడువు నేటితో ముగియగా, ఈసారి సీజే బెంచ్ విచారణ చేపట్టింది. వాదనల సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

పిటిషన్ మూలాల్లోకి వెళితే ఇదేమంత అత్యవసరమైన కేసులా కనిపించడంలేదని అన్నారు. ఈ కేసును తొలుత విచారణకు స్వీకరించిన వెకేషన్ బెంచ్ తన పరిధిని దాటి వ్యవహరించినట్టు భావిస్తున్నామని అభిశంసించారు. ఈ జీవో నెం.1 కేసు గురించి తనకేమీ తెలియదని అనుకోవద్దని, ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందో మూలాల్లోకి వెళ్లి క్షుణ్ణంగా తెలుసుకున్నానని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. హైకోర్టు రిజిస్ట్రీ ఎప్పటికప్పుడు సమాచారం నివేదించిందని వెల్లడించారు. 

ఈ కేసులో వెకేషన్ బెంచ్ ఒక డిఫాక్టో చీఫ్ జస్టిస్ లా వ్యవహరించిందని విమర్శించారు. ప్రతి కేసుకు ప్రాధాన్యత ఆపాదించుకుంటూ వెళితే హైకోర్టు పరిస్థితి ఏమవుతుంది? ఈ ధోరణిని అనుమతిస్తే ప్రతి వెకేషన్ జడ్జి కూడా తనను తాను చీఫ్ జస్టిస్ అనుకుంటారేమో! అని సీజే వ్యాఖ్యానించారు. 

అసలు, ఈ కేసులో ఇంత హడావుడిగా లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేయాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. పిటిషనర్ కు లబ్ది చేకూర్చాలన్న తాపత్రయం తప్ప దీంట్లో మరేమీ కనిపించడంలేదని, ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి గత పది రోజుల వ్యవధిలో ధర్నా చేపట్టారా? అని సీజే నిలదీశారు. అత్యవసరం కానప్పుడు లంచ్ మోషన్ పిటిషన్ ను ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. 

ఇటీవల, ఏపీ ప్రభుత్వం రోడ్లపై సభలు, సమావేశాల అనుమతులకు సంబంధించి జీవో నెం.1 తీసుకువచ్చింది. అయితే, తమను అడ్డుకోవడానికి ఈ బ్రిటీష్ కాలం నాటి జీవో తీసుకువచ్చారని విపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. 

ఈ జీవోపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, జీవో నెం.1ను హైకోర్టు బెంచ్ ఈ నెల 23వరకు సస్పెండ్ చేసింది. ఆ స్టే నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే నేడు సీజే బెంచ్ తదుపరి విచారణ షురూ చేసింది.

More Telugu News