ప్రశాంత్ రెడ్డి ఇకనైనా నంగనాచి మాటలు చెప్పడం ఆపాలి: బీజేపీ ఎంపీ అరవింద్

23-01-2023 Mon 18:25 | Telangana
  • పసుపు రైతులకు ప్రభుత్వం ఏం చేస్తోందన్న అరవింద్
  • కేసీఆర్ వద్దకు వెళ్లి ప్రశాంత్ రెడ్డి మద్దతు ధర అడగాలని హితవు
  • పరిశ్రమలు పెట్టేందుకు వస్తే కమీషన్ల పేరిట వేధిస్తున్నారని ఆగ్రహం
BJP MP Dharmapuri Aravind take a dig at minister Vemula Prashant Reddy
తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిదానికీ అరవింద్ మమ్మల్ని తిడతాడు... ఎన్ని మాటలు అన్నా పడతాం వంటి నంగనాచి మాటలు ఇకనైనా ఆపాలని స్పష్టం చేశారు. తెలంగాణ గ్రామాల్లో చేతకాని వాళ్లను నప్పతట్లోడు అంటారని, ఏపీలో బీఆర్ఎస్ పెడుతున్నారు కదా... ఏపీ వాళ్లు కూడా నప్పతట్లోడు అంటే ఏంటో తెలుసుకోవాలని చెబుతున్నానని అరవింద్ వివరించారు. 

కేసీఆర్ వద్దకు ప్రశాంత్ రెడ్డి వెళ్లి పసుపు రైతులకు ఎంత ఇస్తారో డిమాండ్ చేసి అడగాలని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ఈ ముదనష్టపోళ్లను ఓడించి, డబుల్ ఇంజిన్ సర్కారును తెచ్చుకోవాలి అని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ లో పసుపు శుద్ధి పరిశ్రమ పెట్టేందుకు ఒక బాబా వస్తే కమిషన్ల భయంతో పారిపోయాడని తెలిపారు. ఎవరైనా పరిశ్రమలు పెట్టేందుకు వస్తే, ప్రశాంత్ రెడ్డి తదితరులు పెట్టే బాధలు అన్ లిమిటెడ్ అని పేర్కొన్నారు. 

ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇక్కడ ఏదైనా పరిశ్రమ పెట్టాలనుకున్నా, కేంద్రం ఏదైనా పథకాలు అమలు చేయాలన్నా ఇక్కడ లభించే సహకారం శూన్యం అని వివరించారు. 

ఈ బుద్ధిలేని ప్రశాంత్ రెడ్డికి మరో ప్రశ్న... 2020-21లో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.10 వేలు కేటాయిస్తే ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టారా? అంటూ ధర్మపురి అరవింద్ నిలదీశారు.