లేటెస్ట్ హంగులతో యమహా కొత్త బైక్.. త్వరలోనే భారత దేశ మార్కెట్లోకి !

23-01-2023 Mon 13:38 | Business
  • జీటీ 150 ఫేజర్ పేరుతో చైనాలో విడుదల
  • ప్రారంభ ధర 13 వేల యువాన్లకు పైనే..
  • మన రూపాయిల్లో దాదాపు 1.60 లక్షలు
Yamaha Powerful Bike GT 150 Fazer Launched in china
తొంభయ్యవ దశకంలో కుర్రకారును ఉర్రూతలూగించిన యమహా ఆర్ ఎక్స్ 149 మోడల్ కు లేటెస్ట్ వెర్షన్ తీసుకొస్తున్నట్లు యమహా కంపెనీ ప్రకటించింది. జపాన్ కు చెందిన ద్విచక్రవాహన తయారీ దిగ్గజం తాజాగా ‘జీటీ 150 ఫేజర్’ పేరుతో కొత్త బైక్ ను ఇప్పటికే చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. అదిరిపోయే లుక్ లో స్టయిలిష్ గా ఉన్న ఈ బైక్ ప్రారంభ ధర 13,390 యువాన్లు (మన రూపాయిల్లో సుమారు 1.60 లక్షలు) అని ప్రకటించింది. అయితే, భారత దేశంలో ఈ బైక్ ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాల సమాచారం.

150సీసీ ఇంజన్ తో తయారైన జీటీ 150 ఫేజర్ లో ఆధునిక బైక్ లకు ఉన్న అన్ని హంగులు ఉన్నాయి. ఇది 7,500 ఆర్ పీఎం వద్ద 12.3 హార్స్ పవర్, 12.4 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్ మొత్తం బరువు 126 కిలోలు. అల్లాయ్ వీల్స్, ఎగ్జాస్ట్ ఇంజన్, సిగ్నేచర్ రెట్రో బిట్స్‌లో రౌండ్ హెడ్‌ల్యాంప్, రియర్ వ్యూ మిర్రర్స్, ఫోర్క్ గైటర్‌లు, ఫెండర్‌లతో కూడిన ఫ్రంట్, రియర్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఫ్యూయెల్ ట్యాంక్ ను టియర్ డ్రాప్ ఆకారంలో డిజైన్ చేశారు. దీని సామర్థ్యం 12.5 లీటర్లు. 12 వాల్ట్స్ డీసీ ఛార్జింగ్ సాకెట్ ను బైక్ లో అమర్చారు. ప్రస్తుతం ఈ బైక్ వైట్, గ్రే, డార్క్ గ్రే, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.