కృష్ణగారు ఇచ్చిన ధైర్యమే ఇది: 'హంట్' ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో సుధీర్ బాబు

23-01-2023 Mon 13:21 | Entertainment
  • సుధీర్ బాబు తాజా చిత్రంగా రూపొందిన 'హంట్'
  • ఆయన జోడీగా అలరించనున్న చిత్ర శుక్లా 
  • కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ 
  • ఈ నెల 26వ తేదీన విడుదల కానున్న సినిమా
Hunt Movie Pre Release Press Meet
సుధీర్ బాబు హీరోగా 'హంట్' సినిమా రూపొందింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, మహేశ్ సూరపనేని దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబు జోడీగా చిత్ర శుక్లా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ .. భరత్ కీలకమైన పాత్రలను పోషించారు. అర్జున్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై సుధీర్ బాబు మాట్లాడుతూ .. "నేను సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నప్పుడు నన్ను ప్రోత్సహించింది కృష్ణగారు. కష్టపడితే సక్సెస్ అదే వస్తుందని నాకు చెప్పింది ఆయనే. కృష్ణగారు వెలిగించి ఇచ్చిన కాగడాను పట్టుకుని నేను పరిగెత్తవలసి వుంది. ఎంత దూరం వెళతానో తెలియదు .. ప్రయత్నం మాత్రం చేస్తున్నాను" అన్నాడు.

"చనిపోవడానికి ముందు కృష్ణగారు మహేశ్ బాబుగారి సినిమాలు గానీ .. నా సినిమాలు గాని మాత్రమే చూసేవారు .. అంతకంటే ఇంకా ఏం కావాలి? కృష్ణగారు ఇచ్చిన ధైర్యంతో ముందుకు వెళుతున్నాను. దానికి మీ అందరి ఆదరణ తోడు కావాలి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు..