pocket Insurance: బీమా వుంటే.. విలువైన గ్యాడ్జెట్ డ్యామేజ్ అయినా నో వర్రీ!

  • రోజువారీ వినియోగించే అన్ని ఉత్పత్తులకు బీమా సదుపాయం
  • పాకెట్ ఇన్సూరెన్స్ పేరుతో ఆఫర్ చేస్తున్న బీమా సంస్థలు
  • స్వల్ప ప్రీమియానికే పూర్తి రక్షణ
Insurance policy for your gadgets What is covered premium charged

నేడు స్మార్ట్ ఫోన్ లేకపోతే గంట గడవని పరిస్థితి. ఎక్కువ మంది ఎదుర్కొనే పరిస్థితి ఇది. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్, స్మార్ట్ వాచ్ ఇవన్నీ ఆధునిక జీవనంలో సాధారణ వినియోగ వస్తువులుగా మారిపోయాయి. అంతెందుకు టీవీ, ఫోన్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. ఖరీదైన ఈ వస్తువులు డ్యామేజ్ అయ్యే రిస్క్ కూడా ఎక్కువే. డ్యామేజ్ ఏ రూపంలో అయినా ఎదురుకావచ్చు. ఉదాహరణకు యాపిల్ ఐఫోన్ రూ.65వేలు పెట్టి కొనుక్కున్న నెల రోజులకే కింద పడి స్క్రీన్ పగిలిపోతే పరిస్థితి ఏంటి? యాపిల్ ఫోన్ కు స్క్రీన్ వేయించాలంటే తక్కువలో తక్కువ రూ.20వేలు సమర్పించుకోవాలి. అందుకని ఖరీదైన గ్యాడ్జెట్లు అన్నింటికీ బీమా కవరేజీ తీసుకోవడం మంచి ఐడియా అవుతుంది.

కింద పడినా.. లేదంటే నీళ్ల కారణంగా డ్యామేజ్ అయినా వేలాది రూపాయల నష్టం ఏర్పడుతుంది. ఇటువంటి సందర్భాల్లో తిరిగి మరమ్మతులు చేయించుకునేందుకు బీమా సంస్థలు పరిహారం చెల్లిస్తాయి. కనుక ఈ తరహా బీమా కవరేజీలను స్వల్ప ప్రీమియంతో తీసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. దీనివల్ల మనపై ఆర్థిక భారం పడకుండా రక్షణ కల్పించుకోవచ్చు. 

ఇంట్లో ఎయిర్ కండీషనర్ నుంచి సన్ గ్లాసెస్ వరకు పాకెట్ ఇన్సూరెన్స్ పేరుతో బీమా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. బజాజ్ ఫిన్ సర్వ్ మార్కెట్స్ సంస్థ 380 ఉత్పత్తులకు పాకెట్ ఇన్సూరెన్స్ విభాగంలో బీమా ఆఫర్ చేస్తోంది. వ్యాలెట్లు, హ్యాండ్ బ్యాగ్ లు, వాచీలు ఇలా ఎన్నో ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. పాకెట్ ఇన్సూరెన్స్ అనేది కొత్త విభాగం. ఆన్ లైన్ కొనుగోళ్లను దృష్టిలో పెట్టుకుని, తక్కువ ప్రీమియంకే కవరేజీని ఆఫర్ చేసే సాధనం ఇది. 

మొబైల్ ఫోన్లు
ఫోన్ ఖరీదు బట్టి వార్షిక ప్రీమియం రూ.1,000-5,000 మధ్య ఉంటుంది. ప్రమాదం కారణంగా ఫోన్ దెబ్బతింటే, స్క్రీన్ లేదా ఫోన్ కు నష్టం ఏర్పడితే, నీళ్లలో పడి దెబ్బతింటే పరిహారం కోరొచ్చు. ఫోన్ పూర్తిగా దెబ్బతింటే ఇన్వాయిస్ లో ఉన్న మొత్తం వెనక్కి వచ్చేస్తుంది. ఫోన్ పోగొట్టుకుంటే, తయారీలో లోపాలు ఉంటే, ఎలక్ట్రికల్ వల్ల దెబ్బతింటే పరిహారం రాదు.

ల్యాప్ టాప్
వార్షిక ప్రీమియం రూ.5,000 వరకు ఉంటుంది. ప్రమాదవశాత్తూ ల్యాప్ ట్యాప్ కు నష్టం కలిగితే, ఎలక్ట్రికల్, మెకానికల్ అంశాల వల్ల నష్టం ఏర్పడితే పరిహారం వస్తుంది. నిర్లక్ష్యం వల్ల, అనధికార కేంద్రాల్లో రిపేర్ చేయించినా, భారత్ కు వెలుపల డివైజ్ కొనుగోలు చేసినా పరిహారం రాదు.

టెలివిజన్
ప్రీమియం రూ.2,700 వరకు ఉంటుంది. స్క్రీన్ డ్యామేజ్ అయితే, విడిభాగాలు దెబ్బతింటే పరిహారం లభిస్తుంది. అనధికార కేంద్రాలు, టెక్నీషియన్లతో రిపేర్ చేయించినా లేదంటే నీళ్ల కారణంగా దెబ్బతింటే పరిహారం రాదు. ఇన్వాయిస్ బిల్లు మొత్తానికి కవరేజీ ఉంటుంది. 

వేరబుల్స్
స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ తదితర వేరబుల్స్ కు ఏడాదికి ప్రీమియం రూ.250 వరకు ఉంటుంది. కవరేజీ రూ.20వేలకు లభిస్తుంది. ప్రమాదవశాత్తూ కింద పడి లేదంటే నీటి కారణంగా దెబ్బతిన్నా, చోరీకి గురైనా పరిహారం వస్తుంది. నిర్లక్ష్యం కారణంగా దెబ్బతింటే కవరేజీ రాదు.

More Telugu News