Pawan Kalyan: రేపు కొండగట్టుకు జనసేనాని.. టూర్ షెడ్యూల్ ఇదిగో!

  • అంజన్న సన్నిధానంలో పార్టీ ప్రచార రథం ‘వారాహి’కి పూజ
  • ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న పవన్ కల్యాణ్
  • కొండగట్టులో పూజల అనంతరం కార్యకర్తలతో సమావేశం
  • సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకోనున్న జనసేన చీఫ్
Pawan Kalyan to perform puja of his campaign vehicle Varahi at Kondagattu temple

జనసేన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ మంగళవారం రోడ్డెక్కనుంది. కొండగట్టు ఆలయంలో ఈ వాహనానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు జరిపించనున్నారు. ఆపై ధర్మపురిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తెలంగాణకు చెందిన జనసేన పార్టీ ముఖ్యులతో పవన్ కల్యాణ్ సమావేశం అవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సారి తెలంగాణలోనూ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు. దీనిపై ఈ పర్యటనలో పార్టీ నేతలతో చర్చలు జరపనున్నారు.

మంగళవారం ఉదయం 7 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి కొండగట్టుకు బయలుదేరుతారు. ఉదయం 11 గంటలకు అంజన్న దర్శనం చేసుకుని, ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు జరిపిస్తారు. మధ్యాహ్నం 1 గంటలకు నాచుపల్లి శివార్లలోని బృందావన్ రిసార్టులో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్యులతో భేటీ అవుతారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అనుసరించాల్సిన వ్యూహాలపైన వారితో చర్చిస్తారు. సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడి నుంచే అనుష్టుప్ నారసింహయాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శన) ను మొదలుపెడతారు. సాయంత్రం 5:30 గంటలకు పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు.

More Telugu News