crane crash: తమిళనాడులో ఆలయ ఉత్సవాలలో అపశ్రుతి.. క్రేన్ కూలి నలుగురి దుర్మరణం.. వీడియో ఇదిగో!

  • ఉత్సవ విగ్రహాలకు పూల మాలలు వేసే ప్రయత్నంలో కూలిన క్రేన్
  • ప్రమాద సమయంలో క్రేన్ పై మొత్తం ఎనిమిది మంది
  • క్రేన్ వాడకానికి అనుమతి లేదన్న పోలీసులు
  • ఆపరేటర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడి 
4 Dead in Crane Crashes At Tamil Nadu Temple Festival

తమిళనాడులోని ఓ ఆలయ ఉత్సవాలలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవమూర్తుల ఊరేగింపు సందర్భంగా క్రేన్ కూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాణిపేట జిల్లాలోని ద్రౌపది టెంపుల్ లో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో క్రేన్ పై మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఉత్సవాలకు హాజరైన భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు.

ఏటా సంక్రాంతి తర్వాత రాణిపేటలోని ద్రౌపది ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. ఆదివారం సాయంత్రం కూడా ఈ ఊరేగింపు చేపట్టారు. భారీ క్రేన్ పై ఉత్సవ విగ్రహాలను ఉంచి, పూజారులు, ఆలయ సిబ్బంది ఎనిమిది మంది పైకెక్కారు. విగ్రహాలను పూలమాలలతో అలంకరించేందుకు ప్రయత్నిస్తుండగా క్రేన్ మొరాయించింది. బ్యాలెన్స్ తప్పి ఊగుతుండడంతో పైనున్న ఎనిమిది మంది గాల్లో వేలాడారు.

వారిని కిందికి దించే ప్రయత్నం చేస్తుండగానే క్రేన్ కూలిపోయింది. క్రేన్ ను బాగా ఎత్తుకు తీసుకెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని రాణిపేట ఎస్పీ దీపా సత్యన్ చెప్పారు. వాస్తవానికి ఆలయ ఉత్సవాలలో క్రేన్ ఉపయోగానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, దాని గురించి పోలీసులకు సమాచారం కూడా ఇవ్వలేదని ఎస్పీ పేర్కొన్నారు. క్రేన్ ఆపరేటర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు దీపా సత్యన్ వివరించారు.

More Telugu News