బాయ్ కాట్ ట్రెండ్ పై కరీనా కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

23-01-2023 Mon 09:14 | Entertainment
  • బాలీవుడ్ ను షేక్ చేస్తున్న బాయ్ కాట్ ట్రెండ్
  • సినీ పరిశ్రమకు ఇది మంచిది కాదన్న కరీనా  
  • సినిమాలు లేకపోతే మీకు వినోదం ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్న
Kareena Kapoor response on boycott Bollywood trend
గత కొంత కాలంగా బాలీవుడ్ ను బాయ్ కాట్ ట్రెండ్ కుదిపేస్తోంది. పలానా సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ట్రెండ్ కు భారీ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఫ్లాప్ లుగా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ అగ్రనటి కరీనా కపూర్ స్పందిస్తూ... బాయ్ కాట్ ట్రెండ్ సినీ పరిశ్రమకు మంచిది కాదని అన్నారు. దీంతో తాను ఏకీభవించనని చెప్పారు. బాయ్ కాట్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ప్రేక్షకులను తాము ఎలా ఎంటర్టయిన్ చేయగలమని ప్రశ్నించారు. సినిమాలే లేకపోతే మీకు వినోదం ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు. 

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ 'పఠాన్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలోని 'బేషరమ్' పాటలో దీపిక కాషాయం రంగు బికినీ ధరించి అందాలను ఆరబోసింది. దీంతో, ఈ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరీనా ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఆమిర్ ఖాన్ తో కలిసి తాను నటించిన 'లాల్ సింగ్ చడ్డా' సినిమా సైతం బాయ్ కాట్ దెబ్బకు గురైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఒక డిజాస్టర్ గా నిలిచిపోయింది.