Palakkad: పాలక్కాడ్‌లో పట్టుబడిన పోకిరీ ఏనుగు.. ధోనీ అని పేరు పెట్టిన మంత్రి!

  • రెండేళ్లుగా ప్రజలను హడలెత్తిస్తున్న ఏనుగు
  • మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వృద్ధుడిని తొక్కి చంపిన వైనం
  • మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి బంధించిన వైద్యుల బృందం
  • సంబరాలు చేసుకున్న గ్రామస్థులు
Kerala Forest darting team goes after rampaging elephant PT 7

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో రెండేళ్లుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఏనుగును ఎట్టకేలకు అటవీ అధికారులు బంధించారు. జనావాసాలను, పంటలను నాశనం చేస్తూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఈ ఏనుగు ఎప్పుడు ఎక్కడ దాడిచేస్తుందో తెలియక జనం హడలిపోయేవారు. గతేడాది జులైలో మార్నింగ్ వాక్ చేస్తున్న 60 ఏళ్ల వృద్ధుడిని తొక్కి చంపింది. జిల్లాలోని ధోనీ గ్రామంతోపాటు చుట్టుపక్కల గ్రామాలను వణికిస్తున్న ఈ పోకిరీ ఏనుగును పట్టుకునేందుకు అటవీ అధికారులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఏనుగుకు అధికారులు పాలక్కాడ్ టస్కర్-7 (పీటీ-7) అని పేరు పెట్టారు. 

ఈ ఏనుగును పట్టుకునేందుకు వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా నేతృత్వంలోని ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీం’ నిన్న తెల్లవారుజామున అడవిలోకి వెళ్లి ఏనుగు కోసం కాపుకాసింది. అది కనిపించగానే మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి బంధించింది. ఏనుగు పట్టుబడిన విషయం తెలిసిన ధోనీ గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు. సాయంత్రం అవుతోందంటే భయంగా ఉండేదని, ఇప్పుడిక ప్రశాంతంగా ఉండొచ్చని అన్నారు. ఏనుగు పట్టుబడిన విషయం తెలుసుకున్న కేరళ అటవీశాఖ మంత్రి శశీంద్రన్ గ్రామానికి వచ్చి డాక్టర్ అరుణ్ జకారియా బృందాన్ని అభినందించారు. పట్టుబడిన ఏనుగుకు ‘ధోనీ’ అని పేరు పెట్టారు.

More Telugu News