తమ బిడ్డకు పేరుపెట్టమని కోరిన దంపతులు.. 'జగన్' అని నామకరణం చేసిన హోంమంత్రి తానేటి వనిత

22-01-2023 Sun 21:21 | Andhra
  • దారవరంలో గడపగడపకు మన ప్రభుత్వం
  • ఇంటింటికీ తిరిగిన హోంమంత్రి తానేటి వనిత
  • రెండు నెలల శిశువుకు నామకరణం చేయాలన్న దంపతులు
  • సీఎం పేరు పెట్టిన తానేటి వనిత
  • మురిసిపోయిన దంపతులు
Home Minister Taneti Vanitha christened a child Jagan
ఏపీ హోంమంత్రి తానేటి వనిత చాగల్లు మండలం దారవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఓ మగశిశువుకు జగన్ అని నామకరణం చేశారు. దాంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు మురిసిపోయారు. 

దారవరం గ్రామానికి చెందిన వినోదిని అనే యువతిని పసివేదుల గ్రామానికి చెందిన పుచ్చకాయల బంగార్రాజు అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. బంగార్రాజు, వినోదిని దంపతులకు రెండు నెలల కిందట అబ్బాయి పుట్టాడు. ప్రస్తుతం వినోదిని దారవరంలోని తన పుట్టింట్లో ఉంది. అదే గ్రామానికి హోంమంత్రి తానేటి వనిత పర్యటనకు రాగా, ఆమెను వినోదిని, బంగార్రాజు దంపతులు కలిశారు. తమ బిడ్డకు నామకరణం చేయాలని హోంమంత్రిని కోరారు. 

దాంతో తానేటి వనిత సీఎం పేరిట ఆ చిన్నారికి జగన్ అంటూ పేరుపెట్టారు. చిన్నారిని చేతుల్లోకి తీసుకుని లాలించారు. అనంతరం ఆ దంపతులకు అప్పగించారు. కాగా, సీఎం జగన్ అంటే తమకు ఎంతో అభిమానం అని, ఆయన పేరును తమ బిడ్డకు పెట్టడం ఎంతో ఆనందం కలిగించిందని వినోదిని, బంగార్రాజు తెలిపారు.