గిరిజనులు అంటే కేసీఆర్ కు చులకన: బండి సంజయ్

22-01-2023 Sun 19:10 | Telangana
  • ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర
  • కేంద్రమంత్రి అర్జున్ ముండాతో కలిసి హాజరైన బండి సంజయ్
  • హిందూ జాతరలను కేసీఆర్ పట్టించుకోవడంలేదని విమర్శలు
  • తాము అధికారంలోకి వస్తే జాతరలు ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి
Bandi Sanjay criticizes CM KCR
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. గిరిజనులు అంటే కేసీఆర్ కు చులకన అని విమర్శించారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి అవుతుంటే, అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. నాగోబా జాతరను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. 

హిందూ జాతరలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కానీ నిజాం వారసుల మృతదేహాలను మాత్రం స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు. సెలబ్రిటీలు మరణిస్తే వెళతారు కానీ, గిరిజనుల ప్రాంతాల్లో మాత్రం పర్యటించరని విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మాట తప్పారని వెల్లడించారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని హిందూ జాతరలు ఘనంగా నిర్వహిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నిర్వహిస్తున్న నాగోబా గిరిజన జాతరకు కేంద్రమంత్రి అర్జున్ ముండాతో కలిసి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ కు చివరివని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.