Yanamala: యువగళాన్ని అడ్డుకుంటే రాష్ట్ర యువతను అడ్డుకున్నట్టే: యనమల

  • ఈ నెల 27 నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర
  • మీడియాతో మాట్లాడిన యనమల
  • యువత సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర అని వెల్లడి
  • అడ్డుకునేందుకు జీవో నెం.1 తీసుకువచ్చారని ఆరోపణ
  • ఇప్పుడు పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని ఆగ్రహం
Yanamala warns YCP leaders if they block Lokesh Yuvagalam it is blocking youth

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి యువగళం పేరిట పాదయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో, పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. లోకేశ్ యువగళం పాదయాత్రను అడ్డుకుంటే రాష్ట్ర యువతను అడ్డుకున్నట్టేనని స్పష్టం చేశారు. యువతకు జరిగిన అన్యాయం, వారి సమస్యలు తెలుసుకునేందుకు లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని వెల్లడించారు.

జగన్ రెడ్డి, అతని దొంగల ముఠా ఈ పాదయాత్రను అడ్డుకోవాలని కుట్రలు చేస్తోందని యనమల ఆరోపించారు. ఈ కుట్రలో భాగమే జీవో నెం.1 అని అన్నారు. అది కాస్తా హైకోర్టులో పెండింగ్ లో ఉండేసరికి, డీజీపీని అడ్డుపెట్టి పాదయాత్రను ఆపాలని జగన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. 

"పొంతనలేని సమాచారం ఇవ్వాలని కోరుతూ డీజీపీ లేఖ రాయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని స్పష్టమవుతోంది. జగన్ రెడ్డి, అతని ప్రభుత్వంపై యువతలో పెల్లుబుకుతున్న ఆగ్రహం, ఆవేశం, అసంతృప్తిని పోలీసులు, పాలకులు ఆపలేరని గుర్తుపెట్టుకోవాలి. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ అధికారంలో కొనసాగిన దాఖలాలు లేవని జగన్ రెడ్డి తెలుసుకోవాలి. 

శాంతియుతంగా ర్యాలీలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు రాజ్యాంగం భారత పౌరులకు స్వేచ్ఛనిచ్చింది. రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు చూస్తుంటే మనం భారతదేశం వంటి ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అని ఒక్కోసారి అనుమానం కలుగుతోంది. 

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేసుకునేందుకు రాజ్యాంగం అవకాశాలు కల్పించింది. కానీ జగన్ రెడ్డి పాలనలో అడుగడుగునా ఆటంకాలు, నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, అక్రమ కేసులు, బెదిరింపులు వంటి ఘటనలు చూస్తుంటే రాజ్యాంగం మన రాష్ట్రానికి వర్తించదా? అనే అనుమానం కలుగుతోంది. 

యువగళం కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు అనుమతులు కోరితే, డీజీపీ అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడగడం వైసీపీ పతనానికి తొలిమెట్టులా కనిపిస్తోంది. ప్రభుత్వం, డీజీపీ ఇప్పటికైనా స్పందించి రాజ్యాంగయుత, ప్రజాస్వామ్యయుత పాలన అందించాలని, యువగళాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఆపాలని కోరుతున్నాం" అని యనమల డిమాండ్ చేశారు. 

జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా చేసిన పాదయాత్రలో యువతకు అనేక హామీలిచ్చి వాటిని గాలికొదిలేశాడని యనమల ఆరోపించారు. ప్రతి యేటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పోస్టులు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని విస్మరించాడని వివరించారు. 

"రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రాకముందు ఉన్న 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీలిచ్చి వాటి ఊసెత్తలేదు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువతకు స్వయం ఉపాధి అవకాశాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత జగన్ రెడ్డి దోపిడీ విధానాలతో తీవ్రంగా నష్టపోయారు. 

చంద్రబాబు పాలనలో యువతకు స్వయం ఉపాధికి సంబంధించి ప్రత్యేకంగా పథకాలుండేవి. వాటిని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశాడు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి యువతను మోసం చేశాడు. ఉన్నత చదువులు చదివిన యువత నేడు ఉపాధి, ఉద్యోగావకాశాలు లేక పెడదారి పడుతున్నారు. జగన్ రెడ్డి మోసకారి హామీలపై యువత ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని యువతే ఆశగా ఎదురు చూస్తున్నారు" అని వివరించారు.

More Telugu News