New Zealand: న్యూజిలాండ్ నంబర్ వన్ ర్యాంకు పాయే!

  • రెండో స్థానానికి పడిపోయిన కివీస్
  • రెండో వన్డేలో ఓటమి ఎఫెక్ట్
  • మూడో మ్యాచ్ లోనూ ఓడిస్తే టీమిండియానే నంబర్ వన్
New Zealand dethroned from ODI number one rank

గోరుచుట్టు మీద రోకలి పోటు పడ్డట్లుగా తయారైంది న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ పరిస్థితి. అసలే వరుసగా రెండు వన్డేల్లో ఓడిపోయామన్న బాధలో ఉంటే.. ఇప్పుడు వన్డేల్లో నంబర్ వన్ ర్యాంకు కూడా గల్లంతైంది. న్యూజిలాండ్ ప్లేస్ లో ఇంగ్లండ్ మొదటి స్థానానికి చేరుకుంది.

ఇంగ్లాండ్, న్యూజిలాండ్, టీమిండియాకు సమానంగా 113 పాయింట్లే ఉన్నప్పటికీ... సాంకేతికంగా ఇంగ్లండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కివీస్, టీమిండియా జట్లు రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. కివీస్ మూడో వన్డే కూడా ఓడిపోతే... టీమిండియా నంబర్ వన్ స్థానానికి చేరుతుంది. న్యూజిలాండ్ మరింత కిందకి దిగజారే అవకాశం ఉంది.

రెండో వన్డేకు ముందు దాకా కివీస్ 115 పాయింట్లతో ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉంది. 113 పాయింట్లతో ఇంగ్లాండ్, 112 పాయింట్లతో ఆస్ట్రేలియా, 111 పాయింట్లతో టీమిండియా వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. రెండో వన్డేలో కివీస్ ఘోరంగా ఓడిపోవడంతో ర్యాంకులు తారుమారయ్యాయి. కివీస్ కు రెండు పాయింట్లు తగ్గగా... టీమిండియాకు రెండు పాయింట్లు వచ్చాయి. దీంతో 113 పాయింట్లతో సమానంగా మూడు జట్లు నిలిచాయి. ఇక పాకిస్తాన్ 106 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది.

మూడో వన్డేలో కూడా టీమిండియా గెలిస్తే నంబర్ వన్ ర్యాంకును అందుకుంటుంది. టీమిండియా ఇప్పటికే టీ20ల్లో నంబర్ వన్ గా ఉంది. టెస్టుల్లో నంబర్ 2గా ఉండగా... ఆస్ట్రేలియా నంబర్ వన్ గా ఉంది. రెండు జట్ల మధ్య కేవలం 11 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. త్వరలోనే ఆస్ట్రేలియా, ఇండియా మధ్య 4 టెస్టుల సిరీస్ జరగనుంది. అందులో మంచి ఫలితాలు సాధిస్తే.. మూడు ఫార్మాట్లలోనూ నంబర్ వన్ గా నిలిచే అవకాశం ఉంది.

More Telugu News