ఏపీలో త్వరలో 14 వేలకు పైగా పోస్టుల భర్తీ

22-01-2023 Sun 13:13 | Andhra
  • నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి ఏర్పాట్లు
  • ఇప్పటికే రెండుసార్లు నియామకాలు పూర్తిచేసిన ప్రభుత్వం
AP Grama and Ward Sachivalayam Jobs 2023 Notification soon
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఈ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వచ్చే వారం రోజుల్లో ఈ విషయంపై తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఏర్పాట్లు పూర్తయితే ఫిబ్రవరిలో 14,523 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ రెడ్డి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. 2019 జులై- అక్టోబర్ మధ్య మొదటి విడత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ నోటిఫికేషన్ లో మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీ కోసం 2020 జనవరిలో రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసి, కరోనా సమయంలోనూ నియామకాలు పూర్తిచేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం అప్పగించింది.