‘అవెంజర్స్’​ ను దాటేసి భారత్​ లో ‘అవతార్​ 2’ ఆల్​టైమ్ రికార్డు

22-01-2023 Sun 12:38 | Entertainment
  • భారత్ లో ఇప్పటిదాకా రూ. 368.2 కోట్లు రాబట్టిన అవతార్
  • రూ. 367 రాబట్టిన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ రికార్డు బద్దలు
  • ప్రపంచ వ్యాప్తంగా అదరగొడుతున్న అవతార్ 2
Avatar 2 beats Avengers Endgame by becoming highest grossing Hollywood flick in India
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన దృశ్యకావ్యం ‘అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్’ ప్రపంచ వ్యాప్తంగా ఇంకా సందడి చేస్తూనే ఉంది. 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రతి ఒక్కకరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారత దేశంలో ఈ చిత్రానికి అద్భుత ఆదరణ లభించింది. ‘అవతార్ 2’ ఇప్పటి వరకు భారత్ లో రూ.368.2కోట్ల నెట్ కలెక్షన్స్‌ను రాబట్టింది. దాంతో, భారత బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. 

ఇప్పటిదాకా ఈ రికార్డు ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ పేరిట ఉంది. ఈ చిత్రం రూ.367 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ‘అవెంజర్స్’ నెలకొల్పిన రికార్డును ఇప్పటిదాకా మరే హాలీవుడ్ చిత్రం అధిగమించలేకపోయింది. కానీ, ‘అవతార్ 2’ కొన్ని రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. కాగా, ‘అవతార్ 2’ 2022లో అత్యధిక కలెక్షన్స్‌ను రాబట్టిన హాలీవుడ్ చిత్రంగా నిలిచింది.