ఆర్టీసీకి సంక్రాతి కిక్.. 11 రోజుల్లోనే రూ. 165.46 కోట్ల ఆదాయం
- గతేడాదితో పోలిస్తే ఈసారి 62.29 కోట్ల అదనపు రాబడి
- సాధారణ చార్జీలతోనే సంక్రాంతికి 3923 బస్సుల ఏర్పాటు
- 71.1 శాతానికి పెరిగిన ఆక్యుపెన్సీ
సాధారణంగా పండుగ సమయాల్లో ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తుంటారు. కానీ, ఈసారి సాధారణ చార్జీలతోనే రద్దీలకు అనుగుణంగా టీఎస్ ఆర్టీసీ 3923 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తిరుగు ప్రయాణానికి ముందస్తుగా టికెట్ బుక్ చేసుకున్న వారికి 10 శాతం రాయితీ కూడా కల్పించింది. దాంతో, జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపారు.
సంక్రాంతి సందర్భంగా కేవలం 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 2.82 కోట్ల ప్రయాణికులను టీఎస్ ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది గత ఏడాది సంక్రాంతికి ఆక్యూపెన్సీ రేషియో (ఓఆర్) 59.17 శాతం కాగా, ఈ సారి అది 71.1 శాతానికి పెరిగింది. ఇంత రెవెన్యూ రావటం వెనుక కార్మికులు, ఉద్యోగులు, అధికారుల కృషి కీలకమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ పత్రిక ప్రకటనలో తెలిపారు.