కడప జిల్లా గురుకుల పాఠశాలలో 9వ తరగతి బాలిక ప్రసవం

22-01-2023 Sun 10:00 | Andhra
  • వాల్మీకిపురం గురుకుల పాఠశాలలో దారుణ ఘటన
  • మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక
  • విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
9th calss girsl fives birth to baby boy in Kadapa District
కడప జిల్లా వాల్మీకిపురంలో ఉన్న గురుకుల పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక బాలిక ప్రసవించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలికి నిన్న సాయంత్రం కడుపునొప్పి వచ్చింది. నొప్పిని భరించలేకపోతున్న ఆమెను చూసి పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో ఆమె గర్భవతి అని నిర్ధారించారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఫిరోజ్ ఖాన్, ఎస్సై బిందుమాధవి హుటాహుటిన ఆసుపత్రికి తరలివచ్చారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు. మరోవైపు బాధితురాలు గర్భం దాల్చడానికి ఆమె మేనమామే కారణం అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.