Andhra Pradesh: ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందించిన ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

  • రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదన్న ప్రభుత్వం
  • అయినా సరే 5వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని వెల్లడి
  • గతంలోనూ ఇదే పద్ధతి కొనసాగిందన్న రావత్
AP Govt Responds On Employees Salaries

ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఆలస్యం వార్తలపై ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గత రాత్రి స్పందించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం, కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, అయినప్పటికీ ప్రతి నెల 5వ తేదీనాటికే 90 నుంచి 95 శాతం వేతనాలు, పింఛన్లను చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. మిగిలిన 5 శాతం మందికి ఖజానాలో బిల్లులు సమర్పించిన తేదీకి అనుగుణంగా చెల్లింపులు జరుగుతున్నట్టు వివరించారు. ఖజానా అధికారులు నెలాఖరులోగా ఉద్యోగుల జీతాల బిల్లులు చెల్లించగలిగితే కనుక ప్రతి నెల ఒకటో తేదీనే వేతానాలు చెల్లించగలుగుతామని అన్నారు. 

రిజర్వు బ్యాంకు, బ్యాంకుల సెలవులు, రాష్ట్రంలో నిధులు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా చెల్లింపులు జరుగుతున్నట్టు చెప్పారు. గతంలోను, ఇప్పుడు ఇదే పద్ధతి కొనసాగుతోందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఉద్యోగులు, పెన్షన్‌దారులకు జీతాలు సకాలంలో ఇవ్వాలని, ఈ మేరకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ ఉద్యోగ సంఘం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన నేపథ్యంలో రావత్ ఈ వివరణ ఇచ్చారు.

More Telugu News