Sun Spot: సూర్యుడిపై భారీ మచ్చను గుర్తించిన భారత సోలార్ అబ్జర్వేటరీ

  • భారీ సన్ స్పాట్ ను చిత్రీకరించిన కొడైకెనాల్ అబ్జర్వేటరీ
  • ఏఆర్3190గా నామకరణం
  • సూర్యునిపై చల్లని భాగాలే మచ్చలుగా దర్శనం
Indian observatory found biggest sun spot

మండుతున్న అగ్నిగోళం సూర్యుడిపై ఓ భారీ మచ్చ ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. అది కూడా భారత్ కు చెందిన ఓ అబ్జర్వేటరీ ఈ విషయాన్ని గుర్తించింది. దక్షిణ భారతదేశంలోని పళని పర్వతాలపై ఏర్పాటు చేసిన కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ సూర్యుడిపై ఉన్న అతిపెద్ద మచ్చను చిత్రీకరించింది. ఈ సన్ స్పాట్ కు ఏఆర్3190 అని నామకరణం చేశారు. 

సూర్యుడి ఉపరితలంపై ఉండే చీకటి వంటి నల్లని భాగాలే మచ్చల్లా కనిపిస్తాయి. విద్యుదావేశపూరితమైన వాయువులు శక్తిమంతమైన అయస్కాంత క్షేత్రాలను సృష్టిస్తాయి. ఈ మేరకు నాసా వెల్లడించింది. సూర్యుడిపై ఉండే వాయువులు నిరంతరం చలిస్తూ ఉంటాయని, ఇవి అయస్కాంత క్షేత్రాలను వివిధ రూపాల్లోకి మారేలా చేస్తాయి. ఈ ప్రక్రియ కారణంగా సూర్యుడి ఉపరితలంపై భారీ సౌర చర్య ఏర్పడుతుందని నాసా వివరించింది. 

ఇక, ఈ మచ్చలు ఎందుకు నల్లగా ఉంటాయో కూడా నాసా తెలిపింది. సూర్యుడిలోని ఇతర భాగాల కంటే చల్లగా ఉన్న భాగాలే నల్లని మచ్చల రూపంలో దర్శనమిస్తుంటాయని వెల్లడించింది. 

ఈ నల్లని మచ్చలను కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఈ నెల 17, 19 తేదీల్లో చిత్రీకరించింది. ఇందుకోసం 40 సెంమీ టెలిస్కోప్ ను వినియోగించింది. ఈ అబ్జర్వేటరీని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్నారు. సన్ స్పాట్స్ ను లడఖ్ లోని మెరాక్ అబ్జర్వేటరీ నుంచి కూడా గుర్తించారు.

More Telugu News