చెఫ్ కోసం వెదుకుతున్న సాకర్ స్టార్ రొనాల్డో... జీతం రూ.54 లక్షలు!

21-01-2023 Sat 15:59 | Sports
  • మాంచెస్టర్ యునైటెడ్ తో ఒప్పందం తెంచుకున్న రొనాల్డో
  • సౌదీ క్లబ్ అల్ నజర్ తో రూ.4,400 కోట్ల ఒప్పందం
  • పోర్చుగల్ లో సొంతిల్లు నిర్మించుకుంటన్న రొనాల్డో
  • నచ్చిన వంటలు చేసే షెఫ్ దొరక్కపోవడంతో నిరాశ
Ronaldo searches for chef
పోర్చుగల్ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల సౌదీ అరేబియాకు చెందిన అల్ నజర్ క్లబ్ తో రూ.4,400 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తో సుదీర్ఘ ప్రస్థానాన్ని ముగించుకున్న రొనాల్డో ఇప్పుడు ఆసియా లీగ్ ల్లో అడుగుపెట్టాడు. అంతర్జాతీయ ఫుట్ బాల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రొనాల్డానే. 

ఇక, అసలు విషయానికొస్తే... రొనాల్డో వయసు 37 సంవత్సరాలు. ఇక మరెన్నో సంవత్సరాలు అతడి సాకర్ కెరీర్ కొనసాగకపోవచ్చు. అందుకే, రిటైర్మెంట్ తర్వాత సొంతదేశం పోర్చగల్ లో స్థిరపడాలని రొనాల్డో నిర్ణయించుకున్నాడు. 2021లోనే పోర్చుగల్ లో స్థలం కొనుగోలు చేసిన ఈ సాకర్ స్టార్ ఇంటి నిర్మాణం చేపట్టాడు. రూ.170 కోట్ల ఖరీదైన ఆ భవనం ఈ ఏడాది జూన్ నాటికి పూర్తవుతుందట.

అయితే, తన ఇంట్లో సకల రుచులతో వంటలు చేసే ఓ మంచి చెఫ్ కోసం రొనాల్డో వెదుకుతున్నాడు. తన ఫ్యామిలీ చెఫ్ కోసం రొనాల్డో భారీ మొత్తంలో చెల్లించనున్నాడు. చెఫ్ కు ఏడాదికి దాదాపు రూ.54 లక్షలు వేతనం రూపంలో ఇవ్వనున్నాడట. తమకు నచ్చిన పోర్చుగీస్ వంటలు, సుషీ వంటి విదేశీ వంటకాలు చేసే చెఫ్ దొరక్కపోవడంతో రొనాల్డో నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. అందుకే భారీ జీతం ఇచ్చేందుకు కూడా వెనుకాడడంలేదు.