Womens IPL 2023: మహిళల ఐపీఎల్ విశేషాలు ఇవీ..!

  • మొదటి మూడేళ్లు ఐదు జట్లు
  • తర్వాతి రెండేళ్లు ఆరు జట్లు
  • ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం
  • ఒక్కో జట్టుకు రూ.12 కోట్ల నిధి
  • రూ.10 లక్షల నుంచి ఆటగాళ్ల బేస్ ప్రైస్
Womens IPL 2023 All you need to know about WIPL 2023

ఐదు మహిళల జట్లతో ‘వుమెన్స్ ఐపీఎల్’ మొదటి సీజన్ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుంది. ఐదు జట్ల కోసం ఈ నెల 25న వేలం నిర్వహించనున్నారు. అనంతరం ఆయా జట్లు మహిళా క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు వీలుగా ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు. ఈ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించే అవకాశం ఉంది. 

ఒక్కో క్రికెటర్ బేస్ ప్రైస్ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఐదు కేటగిరీలుగా ఉంటుంది. వేలంలో ఒకరు ఎంత ధర అయినా పలకొచ్చు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్న క్యాప్డ్ దేశీ క్రికెటర్లకు బేస్ ప్రైస్ రూ.30 లక్షలు, రూ.40 లక్షలు, రూ.50 లక్షలుగా ఉంటే, ఇప్పటి వరకు జాతీయ జట్టు తరఫున ఆడని అన్ క్యాప్డ్ ప్లేయర్ల బేస్ ధర రూ.10 లక్షలు, రూ.20 లక్షలుగా ఉండనుంది. వేలంలో పాల్గొనే ఆసక్తి ఉన్న ప్లేయర్ల నుంచి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. 

ఐదు జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి. ఇవన్నీ కూడా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలోనే జరుగుతాయి. మార్చిలోనే టోర్నమెంట్ ముగుస్తుంది. ఒక్కో ఫ్రాంచైజీ క్రికెటర్ల కొనుగోలుకు రూ.12 కోట్ల వరకు ఖర్చు చేసుకోవచ్చు. 2024 నుంచి ఏటా రూ.1.5 కోట్ల మేర పర్స్ పెరుగుతూ వెళుతుంది. ఐదో ఏట నాటికి రూ.18 కోట్లకు చేరుతుంది. 

మొదటి మూడు సీజన్లలో ఐదు జట్లు, తర్వాతి రెండు సంవత్సరాల్లో ఆరు జట్ల చొప్పున బరిలోకి దిగుతాయి. ఒక్కో జట్టు ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లను తీసుకోవచ్చు. ఐదో ప్లేయర్ అసోసియేట్ నేషన్ నుంచి ఉండాలనేది షరతు. రూ.10 కోట్లు ప్రైజ్ మనీగా ఉంటుంది. రూ.6 కోట్లు ఛాంపియన్ కు, రన్నరప్ కు రూ.3 కోట్లు లభిస్తాయి. మూడో స్థానంలో ఉన్న జట్టుకు రూ.కోటి లభిస్తుంది.

More Telugu News