Bihar: నడి రోడ్డు మీద వృద్ధుడిని చితకబాదారు.. బీహార్ లో మహిళా కానిస్టేబుళ్ల నిర్వాకం.. వీడియో ఇదిగో!

  • వీడియో తీసి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు ట్వీట్ చేసిన జర్నలిస్టు
  • 70 ఏళ్ల వృద్ధుడిని కొట్టిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • చుట్టూ జనమున్నా ఒక్కరూ ఆపే ప్రయత్నం కూడా చేయలేదని ఆవేదన
Bihar policewomen brutally beat elderly school teacher with baton

సైకిల్ పై వెళుతున్న డెబ్బై ఏళ్ల వృద్ధుడిపై ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు విచక్షణారహితంగా దాడి చేశారు. లాఠీలతో ఆ స్కూల్ టీచర్ ను చితకబాదారు. పట్టపగలు రోడ్డు మీద జరుగుతున్న ఈ దారుణాన్ని ఆపేందుకు చుట్టూ ఉన్నవారు కూడా ప్రయత్నించలేదు. ఈ అమానవీయ ఘటన బీహార్ లోని కైమూర్ లో చోటుచేసుకుంది. ఓ జర్నలిస్టు ఈ దారుణాన్ని వీడియో తీసి ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు ట్వీట్ చేశారు. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

ఇంతకీ ఆ టీచర్ చేసిన తప్పేమిటంటే.. సైకిల్ పై నుంచి కిందపడిపోవడం, ఆపై లేచి నిలబడడానికి సమయం తీసుకోవడమే! దీనివల్ల ట్రాఫిక్ ఆగిందనో లేక మరేంటో కానీ సదరు కానిస్టేబుళ్లు రెచ్చిపోయారు. వృద్ధుడని కూడా చూడకుండా లాఠీలతో కొడుతూనే ఉన్నారు. దెబ్బలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా విడవకుండా విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

70 ఏళ్ల వృద్ధుడు ఎంత ఘోరమైన తప్పుచేసినా సరే ఇంతలా కొట్టకూడదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సదరు మహిళా కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ కూడా ఈ వీడియోపై స్పందించారు. వీడియోను రీట్వీట్ చేస్తూ కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని తేజస్వీ యాదవ్ ను కోరారు. అయితే, ఈ ఘటనపై బీహార్ పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు.

More Telugu News