మీకు ఎవరిపైనైనా కోపం ఉందా.. ఈ బొద్దింకకు వారి పేరు పెట్టేయండి!

21-01-2023 Sat 13:10 | National
  • టొరంటో జూ పార్క్ పిలుపు
  • ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమం
  • రూ.2,050 చెల్లించి ఆన్ లైన్ లో పేరును తెలియజేయవచ్చు
You can name a cockroach after your ex this Valentines Day toronto canada zoo
వినడానికి వింతగానే అనిపించినా.. ఇది నిజమే. కెనాడాలోని టొరంటో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఒక వినూత్నమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ లవర్ లేదా బాస్ లేదా బంధువు లేదా మరెవరి పట్ల అయినా అసంతృప్తితో ఉంటే, వారి పేరును బొద్దింకకు పెట్టి ఊరట పొందొచ్చంటూ పిలుపునిచ్చింది. 

25 డాలర్లు (రూ.2,050) చెల్లించడం ద్వారా బొద్దింకకు పేరు పెట్టొచ్చట. టొరంటో జూ వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీ ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని తొలుస్తున్నారా? ఈ వేలంటైన్స్ డే సందర్భంగా వారి గౌరవార్థం వారి పేరును బొద్దింకకు పెట్టి, రోమాలు నిక్కబొడుచుకునేలా చేయండి’’ అని ట్వీట్ లో పేర్కొంది. 

గొప్ప ఐడియా.. టాప్ 10 పేర్లను మాకు తెలియజేయాలంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఎంత మంది పేర్లను పెడతారో చూద్దామంటూ మరో యువతి కామెంట్ చేసింది. పేరు పెట్టాలనుకునే వారు రూ.2050 చెల్లించి  క్యాంపెయిన్ లో పాల్గొనవచ్చు. అనంతరం బొద్దింకకు ఆ పేరు పెట్టినట్టు డిజిటల్ సర్టిఫికెట్, చందా ముట్టినట్టు రసీదును వన్యప్రాణుల అభయారణ్యం పంపిస్తుంది.