పవన్​ కల్యాణ్​ ‘వీరమల్లు’ టీజర్​ వచ్చేస్తోంది!

21-01-2023 Sat 12:57 | Entertainment
  • క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం
  • చివరి దశకు చేరుకున్న షూటింగ్
  • ఈ నెల 26న టీజర్ వస్తుందన్న నిర్మాత ఎ.ఎం. రత్నం
HariHara Veera Mallu  teaser may release on 26th January
పవన్ కల్యాణ్ తన కెరీర్‌‌లో తొలిసారి చారిత్రక నేపథ్యంలో నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ సినిమాను ఎ.ఎమ్.రత్నం, ఎ.దయాకర్‌‌రావు నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పవర్ స్టార్ క్రేజ్ దృష్ట్యా ఆయన చిత్రం వస్తుందంటే కొన్ని నెలల ముందే తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంటుంది. ఆయన అభిమానులు ఇప్పుడు వీరమల్లు టీజర్‌‌ కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో జోష్ నింపే ప్రకటన చేశారు చిత్ర నిర్మాత ఏఎం రత్నం. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న టీజర్ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

మరోవైపు త్వరలోనే టీజర్ వస్తుందంటూ చిత్ర బృందం కొత్త పోస్ట్ ను వదిలింది. ఒకటి రెండు రోజుల్లో అధికార ప్రకటన రానుంది. మొఘల్‌ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నారు. నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, అనసూయ, పూజిత పొన్నాడ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.