బొమ్మైనా సరే.. ఆఫ్ఘన్ లో స్త్రీలకు ముసుగు తప్పనిసరి!

21-01-2023 Sat 10:22 | Offbeat
  • మహిళలపై ఆంక్షలు విధించి, కఠినంగా అమలు చేస్తున్న ప్రభుత్వం 
  • తాలిబన్ల పాలనలో దుకాణంలోని బొమ్మలకు ముసుగు తొడిగిన యజమానులు
  • గత పాలనలో బొమ్మలు ఉంచడానికి కూడా తాలిబన్లు ఒప్పుకోలేదని వెల్లడి
Female mannequins in Kabul hooded and masked under Taliban rule
తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్ మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలకు అద్దంపట్టే ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహిళలపై తాలిబన్ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు ఎంత కఠినంగా అమలవుతున్నాయో ఈ ఫొటోలను చూస్తే అర్థమవుతుంది. మహిళలు మాత్రమే కాదు.. మహిళ బొమ్మైనా సరే ముఖం బయటకు కనిపించకుండా బురఖా ఉండాల్సిందేనని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. దేశ రాజధాని కాబూల్ లోని ఓ బట్టల దుకాణంలో బట్టల ప్రదర్శన కోసం పెట్టిన బొమ్మల ముఖాలకు ముసుగు కనిపిస్తోంది.

మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదని, బురఖా తప్పనిసరిగా ధరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి కఠినంగా అమలు చేస్తోంది ఆఫ్ఘన్ ప్రభుత్వం. ఇటీవలే, యూనివర్సిటీలలో స్త్రీలకు ప్రవేశంలేదని తేల్చిచెప్పింది. జిమ్ లు, పబ్లిక్ పార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులలోకి కూడా మహిళలను అనుమతించట్లేదు. వీటితో పాటు మహిళలపై చాలా ఆంక్షలు విధించింది. ఇప్పుడు దుకాణాలలో ప్రదర్శనకు పెట్టే మహిళల బొమ్మలకూ ముసుగు ఉండాల్సిందేనని చెబుతోంది.

ఈమేరకు బొమ్మల ముఖాలు కనిపించకుండా ముసుగు వెయ్యాలని తాలిబన్లు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. గత్యంతరంలేక బొమ్మల ముఖాలకు ప్లాస్టిక్ కవర్, క్లాత్ బ్యాగ్ లను కప్పుతున్నట్లు వివరించారు. గతంతో పోలిస్తే ఇప్పుడే కాస్త నయమని మరికొందరు చెబుతున్నారు. తాలిబన్లు గతంలో పాలించినప్పుడు దుకాణాలలో మహిళల బొమ్మలు ఉంచేందుకు ఒప్పుకోలేదని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఉంచాల్సి వస్తే ఆ బొమ్మలకు తల లేకుండా చూడాలని ఆదేశించేవారని వివరించారు.