ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్తుండగా ప్రమాదం.. నలుగురి దుర్మరణం

21-01-2023 Sat 06:59 | Telangana
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
  • ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ప్రమాదం
  • బాధితులను హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తింపు
4 Dead In Road Accident Held In Bhadradri Kothagudem District
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో కారు-లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఇల్లెందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన రణధీర్‌ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. ప్రీవెడ్డింగ్ షూట్ కోసం అందరూ కలిసి మోతే వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.