Subba Raju: ఓటీటీ రివ్యూ: 'ATM ' (జీ 5 వెబ్ సిరీస్)

  • జీ 5 నుంచి మరో వెబ్ సిరీస్ 
  • ఈ రోజునే స్ట్రీమింగ్ అయిన 'ATM'
  • కథనంలో కనిపించని వేగం 
  • ఉత్కంఠను రేకెత్తించలేకపోయిన సీన్స్
  • ఎలాంటి ప్రయోజనం లేని కొన్ని పాత్రలు  
ATM OTT Review

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల పట్ల విపరీతమైన క్రేజ్ పెరుగుతూ పోతోంది. పెద్ద బ్యానర్లు .. స్టార్ డైరెక్టర్లు కూడా వెబ్ సిరీస్ ల పట్ల ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. వెబ్ సిరీస్ ల కారణంగా కొత్త ఆర్టిసులు .. టెక్నీషియన్లు కూడా పరిచయమవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో కూడిన కంటెంట్ తో తమ టాలెంటును నిరూపించుకుంటున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో 'జీ 5' కూడా ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను అందిస్తూ వెళుతోంది. అలా వచ్చిన మరో వెబ్ సిరీస్ 'ATM'. 

దిల్ రాజు తన పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి, ఈ వెబ్ సిరీస్ తోనే ఈ జోనర్ లోకి అడుగుపెట్టారు. ఈ వెబ్ సిరీస్ కి హరీశ్ శంకర్ కథను అందించడం విశేషం. చంద్రమోహన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రశాంత్ విహారి సంగీతాన్ని అందించాడు. సుబ్బరాజు .. పృథ్వీ .. దివ్యవాణి .. సన్నీ .. దివి .. హర్షిణి కోడూరు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ఈ రోజునే స్ట్రీమింగ్ అయింది. 

కథలోకి వెళితే .. జగన్ (సన్నీ)  హైదరాబాదులోని ఒక మురికివాడకి చెందిన యువకుడు. చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఎదగడం వలన, ఎలాగైనా మంచి లైఫ్ ను అనుభవించాలని నిర్ణయించుకుంటాడు. ఈజీగా మనీ సంపాదించే మార్గాలను వెదకడం మొదలెడతాడు. అతనితో పాటే కలిసి తిరిగిన మరో ముగ్గురు యువకులు కూడా అదే ఆలోచనలో ఉంటారు. తాము అనుకున్నట్టుగా లగ్జరీ లైఫ్ ను అనుభవించడం కోసం దొంగతనాలు చేస్తూ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. 

సిటీలో దందాలు చేసే సేఠ్ కి సంబంధించిన ఒక పాత కారును కొట్టేసి వేరే చోట అమ్మేస్తారు. అందులో రహస్యంగా దాచిన 10 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయనే సంగతి వారికి తెలియదు. ఆ సేఠ్ వారిని పట్టుకుని 10 రోజుల్లోగా ఆ వజ్రాలనుగానీ .. అంతటి డబ్బును గాని తనకి అప్పగించకపోతే చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో నలుగురు స్నేహితులు కలిసి, 'ATM' లలో నగదు పెడుతూ వెళ్లే వ్యాన్ ను కొట్టేయాలని నిర్ణయించుకుంటారు. 

పథకం ప్రకారం 25 కోట్లు ఉన్న వ్యాన్ ను కొట్టేసి ఒక అడవిలో దాక్కుంటారు. ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ హెగ్డే (సుబ్బరాజు) రంగంలోకి దిగుతాడు. బస్తీ కుర్రాళ్లే ఆ డబ్బుకొట్టేశారనే విషయాన్ని ఆయన తేల్చేస్తాడు. వాళ్లను పట్టుకోవటానికి పక్కా ప్లాన్ గీస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న ఆ ఏరియా కార్పొరేటర్ గజేంద్ర (పృథ్వీ), ఆ కుర్రాళ్ల దగ్గర నుంచి ఆ పాతిక కోట్లు కొట్టేసి, ఎమ్మెల్యే టికెట్ కొనుక్కోవాలనుకుంటాడు. ఫలితంగా చోటుచేసుకునే పర్యవసానాలతో ఈ కథ మలుపులు తీసుకుంటుంది. 

ఒక వైపున తనకి రావలసిన 10 కోట్ల కోసం సేఠ్ .. ఆయనకి ఇవ్వగా మిగిలిన డబ్బుతో ఎంజాయ్ చేయాలనుకునే బస్తీ కుర్రాళ్లు .. వాళ్ల నుంచి మొత్తం డబ్బు కొట్టేయాలనే ఉద్దేశంతో గజేంద్ర .. దొంగలను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ హెగ్డే వేసే ఎత్తులతో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ లో మొదటి మూడు ఎపిసోడ్స్ లోను కథ ట్రాక్ ఎక్కడానికి పట్టిన సమయమే కనిపిస్తుంది. 5వ ఎపిసోడ్ లో పోలీస్ ఆఫీసర్ గా సుబ్బరాజు రంగంలోకి దిగిన దగ్గర నుంచే కథ ఊపందుకుంటుంది. 

దర్శకుడు సుబ్బరాజు పాత్రను డిజైన్ చేసిన తీరు బాగుంది. 'టీ చెప్పు దాసు' .. 'పిక్' తీయి దాసు' అంటూ డిఫరెంట్ మేనరిజంతో ఆ పాత్ర ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ మొత్తానికి ఈ పాత్రనే ప్రధానం. తన భార్య తనని మోసం చేసిందని చెప్పేసి, ఏ లేడీ వైపు చూడని ఈ పాత్రలో ఆయన చాలా బాగా చేశాడు. బస్తీ పరిస్థితులు ఎలా ఉంటాయనేది దర్శకుడు కళ్లకు కట్టాడు. ఇక అక్కడక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ వినిపిస్తాయి .. మూడు నాలుగు లిప్ లాకులు కూడా కనిపిస్తాయి.

అయితే కథలో అత్యంత కీలకమైన ATM వ్యాన్ తో పారిపోవడమనే సీన్ ఎలాంటి టెన్షన్ బిల్డప్ చేయలేకపోయింది. పాతిక కోట్ల రూపాయలు .. సెక్యూరిటీ సిబ్బంది ఉన్న వ్యాన్ ను తాపీగా కొట్టేయడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇక నిలువెల్లా ఇగో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఉమాదేవి (దివ్యవాణి) పాత్ర ప్రయోజనం ఏమిటనేది అర్థం కాదు. 8వ ఎపిసోడ్ తోనే కథ అయిపోతుందని అనుకుంటే, మరో ఆసక్తికరమైన పాయింట్ ను టచ్ చేసి, సీజన్ 2 కోసం వెయిట్ చేయమన్నారు. 

హారీశ్ శంకర్ అందించిన కథ గురించి మాట్లాడుకోవాలంటే సీజన్ 2 కూడా రావలసిందే. దర్శకుడు చంద్రమోహన్ విషయానికొస్తే, కథనంలో వేగం ఆశించిన స్థాయిలో కనిపించలేదు. కొన్ని సన్నివేశాలను షార్ప్ గా కట్ చేయలేదు. బస్తీ కుర్రాళ్లకు గాయాలై రక్తం కారుతూ ఉంటే అలాగే తిరిగేస్తూ ఉంటారుగానీ .. ఆ రక్తాన్ని మాత్రం తుడుచుకోరు. చూసిన వాళ్లెవరూ ఏమీ అడగరు. ఇంతవరకూ నడిచిన కథలో దివి ... హర్షిణి పాత్రలు ఎలాంటి ప్రయోజనం లేకుండానే కనిపిస్తాయి. ప్రశాంత్ విహారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది .. అలాగే మోనిక్ కుమార్ ఫొటోగ్రఫీ కూడా బాగుంది. సీజన్ 1 లో మిగతా ట్రాకులతో పోల్చితే, సుబ్బరాజు ట్రాక్ మాత్రమే హైలైట్ గా అనిపిస్తుంది.

More Telugu News