మీరు చేసిన దానికి సిగ్గుగా అనిపించడం లేదా?.. ఫైజర్ సీఈవోపై జర్నలిస్టుల ప్రశ్నల వర్షం

20-01-2023 Fri 16:29 | International
  • కరోనా వ్యాక్సిన్ సామర్థ్యంపై ‘రెబెల్ న్యూస్’ రిపోర్టర్ల నిలదీత
  • మీపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదని ఫైర్
  • ఒక్క ప్రశ్నకూ బదులివ్వకుండా వెళ్లిపోయిన ఆల్బర్ట్ బౌర్ల
  • దావోస్ లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు వద్ద ఘటన
Pfizer CEO runs away from vaccine questions in Davos
ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ ‘ఫైజర్’ సీఈవో ఆల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురైంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు వద్ద ఆయనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. సదస్సు నుంచి బయటికి వచ్చిన ఆయన్ను.. ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ సామర్థ్యం గురించి రిపోర్టర్లు నిలదీశారు. దాదాపు 3 నిమిషాలపాటు ప్రశ్నించినా ఆల్బర్ట్ నోరుమెదపలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ‘రెబెల్ న్యూస్’కు చెందిన జర్నలిస్టులు ఫైజర్ సీఈవోను పలు ప్రశ్నలు అడిగారు. ‘‘కరోనా వైరస్ వ్యాప్తిని ఫైజర్ వ్యాక్సిన్ అడ్డుకోలేదన్న నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు?’’ అని నిలదీశారు. ఈ ప్రశ్నను దాటవేసిన ఆల్బర్ట్.. ‘థ్యాంకూ వెరీ మచ్’.. ‘హ్యావ్ ఎ నైస్ డే’ అంటూ వెటకారంగా బదులిచ్చారు. దీంతో ‘‘వ్యాక్సిన్ కు 100 శాతం సామర్థ్యం ఉందని మీరు చెప్పారు. తర్వాత 90 శాతం.. 80 శాతం.. 70 శాతం అని చెప్పుకుంటూ వచ్చారు. వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవన్న విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారు?’’ అని జర్నలిస్ట్ మళ్లీ ప్రశ్నించారు.

ఆల్బర్ట్ స్పందించకపోవడంతో.. ‘‘ప్రపంచానికి మీరు క్షమాపణలు చెప్పాల్సిన సమయమిది. మీ నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసిన దేశాలకు డబ్బు వెనక్కి ఇవ్వాలి’’ అని ఓ జర్నలిస్ట్ డిమాండ్ చేశారు. మీపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా మీరు చేస్తున్న దానికి సిగ్గుగా అనిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇవీమే పట్టించుకోకుండా ఆల్బర్ట్ వెళ్లిపోయారు. దీంతో‘సిగ్గుపడండి’ అంటూ రెబెల్ న్యూస్ జర్నలిస్టులు నినదించారు.