ఆలస్యంగానైనా వరించిన అదృష్టం.. 88 ఏళ్ల వృద్ధుడికి రూ.5 కోట్ల లాటరీ

20-01-2023 Fri 15:00 | National
  • రాత్రికిరాత్రే కోటీశ్వరుడైన పంజాబ్‌లోని దేరబస్సి వాసి
  • 40 ఏళ్లుగా లాటరీలు కొంటున్న మహంత్ దాస్
  • పన్నులు పోను రూ.3.5 కోట్లు చేతికి
88 year old man wins 5 crore lottery in punjab
అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. కాలం కలిసి రావాలంతే.. జీవితమే మారిపోతుంది. అలా ఓ లాటరీ 88 ఏళ్ల వృద్ధుడి జీవితాన్నే మార్చేసింది. ఆయన్ని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.

పంజాబ్‌లోని దేరబస్సికి చెందిన మహంత్‌ ద్వారకా దాస్‌కి లాటరీలు అంటే మహా ఇష్టం. 40 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. కానీ ప్రతిసారి నిరాశే ఎదురయ్యేది. అలా అని లాటరీ టికెట్లు కొనడం ఆపలేదు. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. 

ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఆలస్యంగానైనా అదృష్టం తలుపుతట్టింది.. జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.5 కోట్లను ఆ పెద్దాయన గెలుచుకున్నాడు. అందులో పన్నులు పోగా రూ.3.5 కోట్లు మహంత్ ద్వారకా దాస్‌కు అందించనున్నట్లు లాటరీ నిర్వాహకుడు లోకేశ్‌ తెలిపారు.

రూ.5 కోట్లు గెలవడంతో మహంత్‌ సంతోషానికి అవధుల్లేవు. 35-40 ఏళ్లుగా లాటరీలు కొంటున్నానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పాడు. మహంత్‌ ద్వారకా దాస్‌ తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 1947లో తన కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వలస వచ్చాడు. అప్పటి నుంచి పంజాబ్‌లో ఉంటున్నాడు.