తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై స్పందించిన రష్మిక మందన్న

20-01-2023 Fri 13:08 | Entertainment
  • వాటిని ఎదుర్కొనే పరిపక్వత తనకు ఉందన్న హీరోయిన్
  • ట్రోలింగ్, విమర్శల విషయంలో పాజిటివ్ గా ఉంటానని వెల్లడి
  • ఓటీటీలో విడుదలైన రష్మిక హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను‘
Rashmika Mandanna reacts to all the trolls and controversy in recent times
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో రష్మిక మందన్న ఒకరు. తన సినిమా, వ్యక్తిగత జీవితం గురించిన సంగతులను అభిమానులతో పంచుకుంటారామె. కానీ, వివిధ కారణాల వల్ల సోషల్ మీడియాలో ఆమె తరచూ ట్రోలింగ్, ద్వేషానికి గురవుతోంది. వివిధ ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన ప్రకటనలు, మాటలపై వివాదం రాజుకోవడంతో ఇంటర్నెట్ లో తనను పలువురు టార్గెట్ చేశారు. 

ఇలా నిరంతర విమర్శలు, ట్రోలింగ్‌లను ఎదుర్కొనే పరిపక్వత తనకు వచ్చిందని రష్మిక అంటోంది. ‘నేను ఐదారేళ్లుగా పరిశ్రమలో ఉన్నా. కొన్నిసార్లు ప్రజలు మనల్ని ప్రేమించరని, మన చిత్రాలను ఆస్వాదించరని గ్రహించా. ప్రేక్షకులు నా గురించి సానుకూలంగా మాత్రమే ఆలోచిస్తారని ఆశించకూడదు’ అని తన హిందీ చిత్రం ‘మిషన్ మజ్ను’ ప్రమోషన్స్ లో రష్మిక చెప్పింది.

తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ద్వేషం ప్రదర్శించినా పాజిటివ్‌గా ఉండాలని రష్మిక నిర్ణయించుకుంది. అందరినీ ఆదరిస్తూ సానుకూలంగా ఉండాలనే తన స్వభావాన్ని మార్చుకోలేనని చెప్పింది. కాగా, విజయ్ సరసన రష్మిక నటించిన  తమిళ చిత్రం 'వారిసు' ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులో ఈ చిత్రం ‘వారసుడు‘ టైటిల్ తో విడుదలైంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రష్మిక నటించిన 'మిషన్ మజ్ను' చిత్రం శుక్రవారం నేరుగా ఓటీటీలో విడుదలైంది.