హాకీ వరల్డ్ కప్ లో వేల్స్ పై గెలిచినా భారత్ కు నిరాశే

20-01-2023 Fri 09:29 | Sports
  • నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో 4-2 తేడాతో విజయం
  • గ్రూప్–డి రెండో స్థానంతో నేరుగా క్వార్టర్స్ చేరలేకపోయిన ఆతిథ్య జట్టు
  • ఆదివారం క్రాస్ ఓవర్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడనున్న భారత్
India defeat Wales await quarterfinal fate in Hockey World Cup 2023
పురుషుల హాకీ వరల్డ్ కప్ లో భాగంగా భువనేశ్వర్ లో నిన్న రాత్రి జరిగిన గ్రూప్-డి మ్యాచ్ లో ఆతిథ్య భారత్ 4-2 స్కోరుతో వేల్స్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశ్‌దీప్ సింగ్‌ 32, 45వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా, షంషేర్ సింగ్, హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ ఒక్కో గోల్ సాధించారు. వేల్స్ జట్టులో గారెత్‌, జాకబ్‌ చెరో గోల్ అందించారు. ఈ మ్యాచ్ లో గెలిచినా గ్రూప్-డిలో రెండో స్థానం సాధించిన భారత్ నేరుగా క్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయింది. ఇదే గ్రూపులో భారత్‌తోపాటు మూడు మ్యాచ్‌ల ద్వారా ఇంగ్లండ్‌ ఏడు పాయింట్లతో సమంగా నిలిచింది. 

భారత్‌కంటే ( 4) మెరుగైన గోల్స్‌ ( 9) భేదంతో ఆ జట్టు గ్రూప్‌ టాపర్‌గా క్వార్టర్స్ చేరింది. ఈ నేపథ్యంలో భారత జట్టు గ్రూప్‌లో అగ్రస్థానం చేజిక్కించుకోవాలంటే ఏడుకుపైగా గోల్స్‌ చేయాల్సి వచ్చింది. కానీ భారత్ నాలుగు గోల్స్‌కే పరిమితమైంది. క్వార్టర్ ఫైనల్లో స్థానం కోసం ఆదివారం జరిగే క్రాస్‌ఓవర్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తో భారత్‌ పోటీ పడుతుంది. అదేరోజు మలేసియాతో స్పెయిన్‌ తలపడుతుంది.