UK Police: నా బూట్లలో రూ. 20 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయి.. పోలీసులకు నిజాయతీగా చెప్పేసిన కొకైన్ డీలర్!

  • కారును ఆపి తనిఖీ చేసి బీమా లేదని గుర్తించిన పోలీసులు
  • కారులో ఇంకేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చిన నిందితుడు
  • అతడి నుంచి 19 కేజీల కొకైన్ బ్రిక్స్ స్వాధీనం
  • కోర్టులో నిజం అంగీకరించిన నిందితుడు కీరన్
  • 8 సంవత్సరాల జైలు శిక్ష విధించిన యూకే కోర్టు
Honest Cocaine Dealer Tells UK Cops That He Has Rs 20 Cr Drugs In His Boots

దొంగలు, స్మగ్లర్లలోనూ నిజాయతీపరులు ఉంటారు. నమ్మాలి మరి! ఇంకా అనుమానం ఉంటే ఈ వార్త చదవాల్సిందే. యూకే పోలీసులకు పట్టుబడిన ఓ డ్రగ్ డీలర్ తన బూట్లలో రూ. 20 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి తనలోని నిజాయతీని బయటపెట్టుకున్నాడు. బ్రిటిష్ పోలీసులు తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. గతేడాది మార్చి 31న రాత్రి పదిన్నర గంటల సమయంలో డ్రగ్ కొరియర్ కీరన్ గ్రాంట్ ప్రయాణిస్తున్న స్కోడా ఫాబియా కారును ఎసెక్స్ పోలీసులు ఆపారు. తనిఖీల అనంతరం దానికి బీమా లేదని గుర్తించారు. 

కారు దిగిన 40 ఏళ్ల కీరన్ గ్రాంట్‌ను కారులో ఇంకేమైనా ఉన్నాయా? అని పోలీసులు ప్రశ్నించారు. దీంతో అతడు మరోమాటకు తావులేకుండా, ఏమాత్రం తడుముకోకుండా తన బూట్లలో రూ. 20 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు. అది విన్న పోలీసులు షాకయ్యారు. ‘‘బూట్లలోనా?’’ అని ప్రశ్నించారు. దానికి అతడు తాపీగా అవునని సమాధానం ఇచ్చాడు. ఆశ్చర్యపోయిన పోలీసులు అందులో ఏమున్నాయ్? అని మరో ప్రశ్న వేశారు.

దానికతడు బదులిస్తూ.. ‘‘డ్రగ్స్, పెద్దమొత్తంలో కొకైన్ ఉంది’’ అని బదులిచ్చాడు. ఆ తర్వాత అతడి బూట్లను తనిఖీ చేస్తే అతడు చెప్పింది నిజమేనని తేలింది. కీరన్‌ను, అతడి కారును తనిఖీ చేసిన పోలీసులు మొత్తంగా 19 కేజీల కొకైన్‌ బ్రిక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం డ్రగ్స్ హోల్‌సేల్ విలువ భారత కరెన్సీలో రూ. 6.65 కోట్లు కాగా, బహిరంగ మార్కెట్లో రూ. 19 కోట్లకు పైమాటేనని పోలీసులు తేల్చారు. ఈ నెల 13న జరిగిన కోర్టు విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో న్యాయస్థానం అతడికి 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

More Telugu News